ద్విచక్ర వాహనాలపై తిరుమలకు వెళ్లే వారికి టీటీడీ కీలక సూచన
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోలాహలం నెలకొంది. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి.
బుధవారం 64,277 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,340 మంది తలనీలాలను సమర్పించారు. టీటీడీకి హుండీ ద్వారా 2.89 కోట్ల రూపాయల ఆదాయం అందింది. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నాలుగు కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 22వ తేదీ నాడు గరుడ సేవను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవా రోజుల్లో ఉత్కృష్టమైన సేవగా భావిస్తారు. ఆ రోజున శ్రీవేంకటేశ్వర స్వామివారు గరుడాధీశుడై సప్తలోకాల్లో విహరిస్తారని ప్రతీతి.
అలాంటి గరుడ వాహన సేవలో పాల్గొనడానికి, కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గరుడ సేవ నాడు భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుంటుంది. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తోన్నారు.

ఇందులో భాగంగా- తిరుమల ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఘాట్ రోడ్లల్లో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు. ఈ సాయంత్రం 6 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు వెల్లడించారు.
తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. ద్విచక్ర వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులు తమ వాహనాలను అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది. కాలి నడకన లేదా బస్సులు, ఇతర వాహనాల్లో తిరుమలకు వెళ్లొచ్చు.












Click it and Unblock the Notifications