తిరుమలలో ఆ రోజున సేవలు రద్దు- వైభవోపేతంగా కృష్ణాష్టమి, ఉట్లోత్సవం
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణ మాసం నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటోన్నారు. 31 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది.
భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. మంగళవారం 76,555 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 33,488 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. హుండీ ద్వారా 4.75 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

ఈ నెలలో స్వామివారి విశేష ఉత్సవాలను నిర్వహించబోతోన్నారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా భక్తుల తాకిడి మరింత భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు.
శ్రీ కృష్ణజన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 7, 8 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద గురువారం రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య గోకులాష్టమి ఆస్థానాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
అదే విధంగా గోగర్భం డ్యామ్ వద్ద గల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పంచాభిషేకాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
8వ తేదీ శుక్రవారం తిరుమలలో ఉట్లోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపనున్నారు. ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో వేంచేస్తారు.
ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని 8వ తేదీన తిరుమలలో చేపట్టాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆయా సమయాల్లో ఉట్లోత్సవం ఉంటుందని, మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications