శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: ఆ సేవా టికెట్లు జారీ..!!
తిరుపతి: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో శుభవార్త వినిపించారు. ఇటీవలే సర్వదర్శనం టోకెన్లను జారీ చేసిన అధికారులు ఇవ్వాళ తాజాగా మరో కీలక దర్శనానికి చెందిన టికెట్లను విడుదల చేశారు. భక్తుల సౌకర్యం కోసం వాటిని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఫిబ్రవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లు ఇవి. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లు- టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ద్వారా అడ్వాన్స్డ్ గా బుక్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 23వ నుంచి 28వ తేదీ వరకు తిరుమలలో బాలాలయం కార్యక్రమం జరుగనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆరు రోజుల పాటు అంగప్రదక్షిణం టికెట్లను నిలిపివేశారు. 23 నుంచి 28వ తేదీ వరకు అంగప్రదక్షిణం టికెట్ల జారీ ఉండదు. అంటే- ఫిబ్రవరి నెలలో 22వ తేదీ వరకు మాత్రమే అంగప్రదక్షిణం టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. మార్చి నెలకు ఉద్దేశించిన టికెట్ల విడుదల మరోసారి జారీ చేస్తారు.
బాలాలయం సమయంలో టీటీడీ అర్చకులు గర్భగుడి అంతరభాగంలో స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తుల దర్శనాల సంఖ్యను తగ్గించారు. గర్భాలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని మహా సంప్రోక్షణగా, బాలాలయ అష్టదిగ్బంధనంగా భావిస్తారు.
కాగా- తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు. స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. సోమవారం శ్రీవారిని 70,413 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32,206 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని, తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.