తిరుమలలో ఈ అయిదు రోజుల పాటు విశేష ఉత్సవాలు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 77,848 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 39,317మంది తలనీలాలను సమర్పించారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 2.95 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. ట్రావెలర్స్ బంగ్లా కాటేజీల వరకూ క్యూలైన్ కనిపించింది. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీడీపీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం, మంచినీటిని అందించారు. క్యూలైన్, కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న వారికి అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను పంపిణీ చేశారు. రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు.
కాగా- జూన్‌లో హనుమాన్ జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీన వైభవంగా ఆరంభమౌతాయి. 5వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఇందులో భాగంగా జూన్ 1వ తేదీన శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామివారికి తిరుమంజనం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆకాశగంగ శ్రీ బాలాంజనేయస్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో భక్తులకు వివరించేలా ప్రముఖ పండితులతో ప్రసంగాలు, అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ 2వ తేదీన తెల్లవారు జామున సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమౌతుంది. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు. రోజంతా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications