శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్: తిరుమలలో అవి రద్దు: టీటీడీ కొత్త నిబంధన
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వేలాదిమంది స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. శుక్రవారం నాడు 66,322 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 24,672 మంది తలనీలాలను సమర్పించారు.
హుండీ ద్వారా 3.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పట్టింది. 18 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వేసవి సెలవుల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, దానితో పాటు కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో- టీటీడీ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. శనివారం నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతి గదుల కేటాయింపు కోసం మంజూరు చేసే సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మరకు టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు.

స్వయంగా తిరుమలకు వచ్చే ప్రోటొకాల్ పరిధిలో ఉన్న వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే- నిర్దేశించిన నిబంధనలు, విధివిధానాల మేరకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వసతి గదులను కేటాయిస్తారు. వారు ఇచ్చే సిఫారసు లేఖలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని తేల్చి చెప్పారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అంటే.. కోడ్, ప్రవర్తన నియమావళి తొలగిపోయేంత వరకూ తిరుమలలో ఎలాంటి వసతి, దర్శనాలకు సంబంధించిన సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు, ప్రముఖులు ఈ విషయాన్ని గమనించాలని, తమకు సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications