TTD: నేడు రూ 300 దర్శన టికెట్ల విడుదల, నడక దారి భక్తులకు కొత్త టైమింగ్స్..!!
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి టికెట్లు విడుదల చేసేందుకు టీటీడీ షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ మాసానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ రోజు టీటీడీ విడుదల చేయనుంది. రేపు వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అలిపిరి నడక మార్గంలో భక్తుల ప్రవేశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో భక్తులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచనలు చేసారు.
దర్శనం కోటా విడుదల: టీటీడీ ప్రతీ నెలా నిర్దేశిత తేదీల్లో దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను ఆయా తేదీల్లో ఆన్‌లైన్‌లో ఓ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ రోజు రూ .300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారు. 25వ తేదీన వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఈ షెడ్యూల్ ప్రకారం భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. దర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 72,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ 3.80 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.
నడకదారి భక్తులకు సూచనలు: అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మరోమారు పరిశీలించారు. దాడి చేసింది పిల్లచిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందన్నారు.
టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు.
అనుమతి వేళల ప్రకటన: వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని ఈవో చెప్పారు.
శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications