శ్రీవారి భక్తులకు మరో గుడ్‌న్యూస్: ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్ల జారీ తేదీలు ఇవే
తిరుపతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు రావడం వల్ల భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉంటోన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
మంగళవారం నాడు 77,486 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.77 కోట్ల రూపాయల ఆదాయం అందినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లలో వేచి ఉంటోన్న వారికి అల్పాహారం, పాలు, మంచినీరును టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు అందిస్తోన్నారు.

ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్లను ఎప్పుడు జారీ చేస్తామనేది టీటీడీ అధికారులు కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. గురువారం ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమౌతుంది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
ఇక ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్, శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్లను పొందడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన జారీ చేసే అవకాశం ఉంది. ఆగస్టులో తిరుమలలో వసతి గదులను పొందడానికి అవసరమైన ఆన్‌లైన్ కోటాను ఈ నెల 26వ తేదీన, తిరుపతిలోని విష్ణువాసం, శ్రీనివాసం వంటి చోట్ల వసతి గదులను పొందాలనుకునే వారికి ఈ నెల 27వ తేదీన ఆన్‌లైన్ కోటాను జారీ చేస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications