తెలంగాణలో మెడికో ప్రీతి కన్నుమూసిన వేళ..ఏపీ మంత్రి బొత్స కీలక ప్రకటన..!!
సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన తెలంగాణ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందిన ఉదంతం అనంతరం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.
విజయవాడ: సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసిన ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచెత్తింది. అయిదు రోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొందిన ఆమె ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. సైఫ్ అనే సీనియర్ మెడికల్ స్టూడెంట్.. కొద్దిరోజులుగా ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆవేదనతో ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

నిమ్స్ లో ఆధునిక చికిత్స..
అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమె ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ..ఫలితం దక్కలేదు. ఆదివారం సాయంత్రం ఆమె మరణించినట్లు ప్రకటించారు.

కదిలించిన విషాదం..
ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కదలించింది. నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తోన్నారు. JusticeForPreethi అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్ మీద వేలల్లో ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయి. మెడికో ప్రీతికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తోన్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడటానికి కారణమైన సైఫ్ పై కఠిన చర్యలు తీసుకోవాని కోరుతున్నారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందించాలని సూచిస్తోన్నారు.

మంత్రి బొత్స స్పందన..
ఈ ఉదంతంపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇవ్వాళ విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పై నిషేధం ఉందని స్పష్టం చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ర్యాగింగ్ కు పాల్పడితే..
పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య కళాశాలల వరకు ర్యాగింగ్ పై నిషేధం అమల్లో ఉందని గుర్తు చేశారు మంత్రి బొత్స. ర్యాగింగ్ వల్ల సంభవించే దుష్పరిణామాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని చెప్పారు. అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్యాంపస్ లల్లో తమకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా విద్యార్థులు- వాటిని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి బొత్స సూచించారు.

విద్యార్థుల సంక్షేమానికి..
దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా తమ ప్రభుత్వం విద్యారంగంపై శ్రద్ధ చూపుతోందని మంత్రి బొత్స చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి, ఆర్థికంగా వారికి అండగా ఉండటానికి విద్యా దీవెన, విద్యా కానుక, ముఖ్యమంత్రి గోరుముద్ద వంటి పథకాలను అమలు చేస్తోన్నామని చెప్పారు. నాడు- నేడు పథకం కింద వేల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని, ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో బడ్జెట్ ను కేటాయించలేదని వివరించారు.












Click it and Unblock the Notifications