farmers protest bharat bandh andhra pradesh vijayawada cpi cpm భారత్ బంద్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ సీపీఐ సీపీఎం politics
Bharat Bandh: ఎరుపెక్కిన విజయవాడ: వామపక్ష నేతల భారీ ర్యాలీ: నినాదాలతో
విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా భారత్ బంద్ ఆరంభమైంది. తెల్లవారు జామున 6 గంటల నుంచే నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. సీపీఐ, సీపీఎం సహా తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు, వాటి అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొంటున్నారు. రైల్ రోకో, రాస్తా రోకోలను నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో బంద్ తీవ్రత అధికంగా ఉంటోంది.

విజయవాడలో భారీ ర్యాలీ..
విజయవాడలో వామపక్ష నేతలు రోడ్డెక్కారు. బ్యానర్లు, ప్లకార్డులను చేతబట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్‌బీఎస్) వద్ద ఈ మహా ర్యాలీని చేపట్టారు. వామపక్ష నేతలు, కార్యకర్తలు, వందలాది మందిగా పీఎన్‌బీఎస్ వద్దకు చేరుకున్నారు. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ నిరసన ప్రదర్శనలో సీపీఎం రాష్ట్ర కార్య దర్శి పీ మధు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీ బాబూరావు, న్యూడెమోక్రసీ, అనుబంధ కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, అనుబంధ విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించినందున.. బస్సులేవీ రోడ్డెక్కలేదు.

మోడీ సర్కార్ చర్యల వల్ల
ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతాంగ విధానాలను ఎండగట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నినదించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోండటం దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ కోసం మోడీ సర్కార్ అర్రులు చాస్తోందని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలు రాబోయే తరాలకు పెనుముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీ, అదానీల కోసమే మోడీ పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు.

కార్పొరేట్ల కడుపు నింపడానికే..
మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు పేదలకు ఏ మాత్రం మేలు చేసేవి కావని అన్నారు. అన్ని వ్యవస్థలు, అన్ని రంగాలూ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టబోతోందనడానికి వ్యవసాయ బిల్లులు, ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ వంటి చర్యలే నిదర్శనమని పీ మధు ధ్వజమెత్తారు. నల్ల చట్టాలతో ప్రభుత్వం ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గానీ కేంద్ర ప్రభుత్వానికి వంతపాడేలా వ్యవహిరిస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణతో పాటు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకునేంత వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.