విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం: షోరూంలోని 300 వాహనాలు దగ్ధం
అమరావతి: విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. షోరూంతోపాటు గోదాంలో ఉన్న సుమారు 300 వాహనాల వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.
విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. విజయవాడ నగరంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో వాహనాలు గోదాంలలో ఉంచుతారు. ద్విచక్ర వాహనాల షోరూంతోపాటు సర్వీస్ సెంటర్లను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు.

మొదట షోరూంలోని మొదటి అంతస్తులోనే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వచ్చాయి. కొద్ది సమయంలోనే మంటలు గోదాంకూ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి.
ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించిన షోరూం కావడంతో మంటలు వేగంగా విస్తరించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోదాంలో సాధారణ ద్విచక్ర వాహనాలతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని వెల్లడించారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఉంచం.. వాటిని ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధరించారు.












Click it and Unblock the Notifications