దారుణ హత్యకు గురైన వైసీపీ నేత మోకా భాస్కర్ రావు భార్య..అక్కడ ప్రథమ మహిళ
మచిలీపట్నం: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎంపికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. దారుణ హత్యకు గురైన పార్టీ సీనియర్ నాయకుడు మోకా భాస్కర్ రావు భార్య మోకా వెంకటేశ్వరమ్మను మేయర్‌గా ఎంపిక చేసింది. కొద్దిసేపటి కిందటే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్‌గా చిటికెన వెంకటేశ్వరమ్మ నియమితులయ్యారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడిగా మోకా భాస్కర్ రావుకు గుర్తింపు ఉంది.
గత ఏడాది ఆయన మచిలీపట్నంలో ప్రత్యర్థుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. పార్టీ కోసం ప్రాణాలను సైతం అర్పించిన మోకా భాస్కర్ రావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మోకా వెంకటేశ్వరమ్మను మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిల్చోబెట్టారు. ఈ ఎన్నికల్లో ఆమె ఘన విజయాన్ని అందుకున్నారు. తాజాగా- మచిలీపట్నం ప్రథమ మహిళగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి పేర్నినాని హాజరయ్యారు. కొత్త పాలక మండలి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మచిలీపట్నంలో పార్టీని బలోపేతం చేయడానికి మోకా భాస్కర్ రావు అహర్నిశలు శ్రమించారని, అందుకే- ప్రత్యర్థులు ఆయనను హత్య చేశారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన భార్య మోకా వెంకటేశ్వరమ్మను మేయర్ పదవికి ఎంపిక చేశామని చెప్పారు.
నాయకులు, కార్యకర్తల సేవలను గుర్తించి, వారిని ఆదుకునే పార్టీ వైసీపీ ఒక్కటేనని అన్నారు. పార్టీ కార్యకర్తలే తమ బలమని చెప్పుకొనే తెలుగుదేశం ఏనాడు కూడా ఇలాంటి నిర్ణయాలను తీసుకోలేదని చెప్పారు. అనేక మున్సిపాలిటీల్లో సాధారణ వ్యక్తులు, వార్డు వలంటీర్లను ఛైర్మన్లుగా చేసిన ఘనత తమ పార్టీకి మాత్రమే దక్కుతుందని పేర్నినాని అన్నారు. రొటేషన్ పద్ధతిన మేయర్ స్థానాన్ని పంచుకోవాలనే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications