బాబోయ్ ఏంటిది: లేడీస్ హాస్టల్లో నక్కిన వ్యక్తి.. రోజంతా మంచం కిందే..!
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుంది. లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డ ఓ విద్యార్థి ఒకరోజంతా అందులోనే గడిపాడు. విద్యార్థినుల సహకారంతోనే అతను కిటికీ ఊచలు విరగ్గొట్టి గదిలోకి వెళ్లినట్టు గుర్తించారు. విద్యార్థినులు హాస్టల్ గదికి తాళం వేసి వెళ్లడంతో.. అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు.
లోపల ఒక మంచం కింద దాక్కున్న అతన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. అతను కూడా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు చెందిన విద్యార్థి గానే గుర్తించారు. అతనికి సహకరించిన ఆరుగురు విద్యార్థినులను సస్పెండ్ చేశారు. అతని తల్లిదండ్రులతో పాటు,ఆ ఆరుగురు విద్యార్థినుల తల్లిదండ్రులను క్యాంపస్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై ట్రిపుల్ ఐటీ ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం.

ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఫెస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు,విద్యార్థినులు కలిసే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజా ఘటనతో క్యాంపస్‌లో సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయన్న వాదన వినిపిస్తోంది. విద్యార్థి కిటికీ ఊచలు విరగ్గొట్టి లోపలికి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు గుర్తించలేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఆ సమయంలో విధుల్లో ఉన్న సెక్యూరిటీని గుర్తించి సస్పెండ్ చేసేందుకు యాజమాన్యం సిద్దమవుతోంది. విద్యార్థినులు ఉద్దేశపూర్వకంగానే అతన్ని లోపలికి రానిచ్చారని.. ఒకవేళ వారి ప్రమేయం లేకుండా అతను లోపలికి వస్తే అరిచేవారని భావిస్తున్నారు. ఘటనపై విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications