ముస్లింలకు మీరు, కాపులకు మేమా ? పేర్ని వ్యాఖ్యలకు సోము ఘాటు కౌంటర్..!
ఏపీలో కాపు రిజర్వేషన్ల పోరు ముదురుతోంది. ఇప్పటికే కేంద్రం కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తేల్చిచెప్పేయడంతో ఈ వ్యవహారంలో వైసీపీ ఇరుకునపడుతోంది. ఇదే అంశంపై బీజేపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తుండగా.. ఇప్పుడు వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. తిరిగి వైసీపీ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఇదే జరిగింది.
ఏపీలో కాపు రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు కౌంటర్ ఇచ్చారు. అబద్దాన్ని అందంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేశారని, అందువల్లనే కాపులకు న్యాయం జరగలేదని సోమువీర్రాజు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని వ్యాఖ్యలపై స్పందించిన సోమువీర్రాజు .. కాపుల రిజర్వేషన్లు కేంద్రం తీర్మానం చేయాలని ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు. ముస్లింలకు మాత్రం కేంద్రం అవసరంలేదు కేవలం కాపులకు మాత్రం కేంద్రం కావాలా అంటూ పేర్నినాని వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీసీల రాజకీయ రిజర్వేషన్లలో ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల బీసీలు ప్రజా ప్రతినిధులు అయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారని సోమువీర్రాజు విశ్లేషించారు. అదే విధంగా బిసిల సమస్యలపై ఏలూరులో నిర్వహించినట్లుగానే జోనల్ వారీగా సభలు నిర్వహిస్తా మన్నారు. అబద్దాలను నిజం చేసేందుకు మన రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని సోము విమర్శించారు. ముస్లింలకు రాష్ట్రప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చి కాపులకు మాత్రం కేంద్రం అంటున్నారని సోము ఆక్షేపించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాపులకు అన్నాయం చేసింది కుటుంబ పార్టీలని ఆయన ఆరోపించారు.
పాదయాత్రల్లో హామీలు ఇస్తారు అధికారంలోకి రాగానే హామీలు మరుస్తున్నారు ఇదే మన రాష్ట్రంలో జరుగుతోంది ఈవిషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలంటూ జగన్ ను ఉద్దేశించి సోము వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించకుండా జఠిలం చేస్తున్నాయని కుటుంబ పార్టీలపై సోమువీర్రాజు విరుచుకుపడ్డారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్ళిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తామే నిలదీశామన్నారు . గుంటూరులో నిరసన దీక్షలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 44వేల పోలింగ్ బూత్ ల స్ధాయిలో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications