జగన్ సర్కారుకు టీడీపీ ఝలక్- హెచ్‌ఆర్‌సీ ఎంపిక కమిటీ సమావేశం బహిష్కరణ
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్య పలు అంశాల్లో విమర్శలు, ప్రతివిమర్శల యుద్ధం సాగుతోంది. దీని ప్రభావం కీలకమైన ప్రభుత్వ పాలనపైనా పడుతోంది. అదే సమయంలో మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, సభ్యుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని సైతం టీడీపీ బహిష్కరించింది.
తాజగా జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే హక్కు కూడా లేకుండా.. వైసీపీ సర్కారు బెదిరింపులకు దిగిందని టీడీపీ ఆరోపించింది. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్ధులు పోటీలో లేకుండా చేశారని, ఎదిరించి పోటీలో నిలబడిన వారిని కిడ్నాప్ చేయడం ద్వారా.. ప్రజాస్వామ్య బద్దంగా దక్కిన హక్కుల్ని కాలరాశారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బలహీనవర్గాల ప్రజల హక్కుల్ని హరించి వారిని ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేస్తోందని విమర్శించారు. ఓవైపు ప్రజాస్వామ్య స్పూర్తిని నీరుగారుస్తూ.. ప్రజా హక్కుల్ని హరిస్తూ.. నీరో చక్రవర్తిలా పరిపాలిస్తున్న సీఎం జగన్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

రాజ్యాంగ హక్కులపై గౌరవం లేని ముఖ్యమంత్రి చేసే పనులకు, చెప్పే మాటలకు కనీసం పొంతన లేదని యనమల ఆరోపించారు అలాంటి సీఎం పౌర హక్కులంటూ సమావేశం ఏర్పాటు చేయటడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కుతూ.. దాడులు, దౌర్జన్యాలు, అకృత్యాలతో నెత్తుటి పాలన సాగిస్తున్నారని యనమల విమర్శించారు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను సైతం భంగపరుస్తున్నారని అన్నారు. రాష్ర్టంలో ప్రజలు స్వేచ్చగా మసలుకునే అవకాశం లేకుండా పోయిందని. తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేసే పరిస్థితి లేదని ఆయన పేర్కన్నారు.. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపిన పత్రికారంగంపై, పాత్రికేయులపై దాడులకు పాల్పడ్డి అక్రమ కేసులు బనాయించారని, మీడియా ఆర్ధిక మూలాలను దెబ్బతీశారని విమర్శించారు. అందుకే ఈ సమావేశం బహిష్కరిస్తున్నట్లు యనమల తెలిపారు.












Click it and Unblock the Notifications