ఆయన చెయ్యడు..మరొకరు చేస్తే ఓర్చుకోలేడు: తెగ బాధపడుతున్నాడు: వల్లభనేని వంశీ
విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు పేరును కొత్తగా ఏర్పడబోయే విజయవాడ జిల్లాకు పెట్టడాన్ని టీడీపీ తిరుగుబాటు శాసన సభ్యుడు వల్లభనేని వంశీ స్వాగతించారు. ఎన్టీ రామారావు పేరును పెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని వ్యాఖ్యానించారు. కొత్తవారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన ప్రోద్బలంతో ఎంతోమంది కొత్త వారు రాజకీయాల్లోకి ప్రవేశించారని, చట్టసభల్లో అడుగు పెట్టారని అన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే..
ఇప్పటికీ రాజకీయాల్లో తనలాంటి వారు ఉన్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తేనని వల్లభనేని వంశీ చెప్పుకొచ్చారు. అలాంటి మహానుభావుడి పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని, ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి ఉందని చెప్పారు. 1996 నుంచి 2004 వరకు వివిధ కేంద్ర ప్రభుత్వాలకు తాము తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేశామని అన్నారు. హెచ్‌డీ దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోడీ ప్రభుత్వాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని వల్లభనేని వంశీ గుర్తు చేశారు.
భాగస్వామిగా ఉన్నా ఆ పని చేయలేకపోయాం..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నామని, అయినప్పటికీ.. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ఇప్పించలేకపోయామని, కనీసం కృష్ణాజిల్లాకు ఆ మహనీయుడి పేరు కూడా పెట్టలేకపోయామని వల్లభనేని వంశీ అన్నారు. తాము చేయలేని ఆ పనిని వైఎస్ జగన్ చేసి చూపించారని ప్రశంసించారు. ఎన్టీ రామారావును సైద్ధాంతికంగా విభేధించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి వైఎస్ జగన్.. ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి..
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ చేపట్టిన తన పాదయాత్ర సందర్భంగా ఇదే కృష్ణాజిల్లాలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని, దానికి అనుగుణంగా ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించడానికి కూడా చంద్రబాబు నాయుడికి మనసు రావట్లేదని, ఆయన గొంతు పూడుకపోతోందని విమర్శించారు. కొత్త జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెట్టడం పట్ల చంద్రబాబు తెగ బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ పేరు పెట్టడం వల్ల..
చంద్రబాబు నాయుడు ప్రజలు హర్షించే ఎలాంటి పని చేయరని, మరొకరు చేస్తే..ఓర్చు కోలేడని, అభినందించలేడనే విషయం దీనితో మరోసారి రుజువైందని వల్లభనేని వంశీ అన్నారు. తన గన్నవరం నియోజకవర్గంలో ఎన్టీ రామారావు, తెలుగుదేశం అభిమానులు వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ కన్నుమూసిన 25 సంవత్సరాల తరువాత కూడా గుర్తు పెట్టుకుని ఆయన పేరు పెట్టారని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ వైఎస్ జగన్ మీద ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications