విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం: 16వ తేదీన గడ్కరీ చేతుల మీదుగా, కేశినేని నాని ట్వీట్
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ తేదీ మరోసారి ఖరారయ్యింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి ఈ నెల 16వ తేదీన ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలను అనుమతించిన సంగతి తెలిసిందే. ఫ్లై ఓవర్ ప్రారంభంతో సమయం తగ్గి.. విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి.

గడ్కరీ చేతులమీదుగా..
కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభిస్తారని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. బెజవాడ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణం ఇటీవలే పూర్తయ్యింది. సెప్టెంబరు 4న ఫ్లై ఓవర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. కేంద్ర ప్రభుత్వం ఏడురోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో వాయిదా పడింది. వెంటనే సెప్టెంబరు 18వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు.

కరోనా రావడంతో..
కానీ ఆ సమయానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా వైరస్ సోకింది. దీంతో రెండోసారి వాయిదా పడింది. అయితే ఆయనకు కరోనా వైరస్ తగ్గడంతో మరోసారి తేదీని నిర్ణయించారు. అయితే రెండోసారి వాయిదాపడిన సమయంలో.. రాకపోకలను అనుమతించారు. కానీ అధికారికంగా మాత్రం ఈ నెల 16వ తేదీన ప్రారంభించబోతున్నారు.

ఆకట్టుకున్న డ్రోన్ వీడియో..
ఫ్లై ఓవర్‌కి సంబంధించి డ్రోన్ ద్వారా ఒక వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లై ఓవర్‌తో విజయవాడ నగరం దాదాపుగా కనిపించి.. కనువిందు చేస్తోంది. ఆ దృశ్యం మనోహరంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ఫ్లై ఓవర్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కేంద్రం సాయంతో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభించారు. అలా సాగుతూ.. ఇటీవల పూర్తయ్యింది. విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకూ 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.440 కోట్లతో పనులు చేపట్టారు.

నదిలోకి వెళ్లిందా అనిపించేలా..
విజయవాడ బస్టాండ్ దాటాక కృష్ణానదిని ఆనుకుని ప్రకాశం బ్యారేజీ పక్కనే గల కృష్ణా కాలువపై నుంచి సాగే ఫ్లైఓవర్ కనకదుర్గ గుడి వద్ద ఏకంగా నదిలోకి వెళ్లిందా అనుకునేలా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ఇరుకైన మార్గంలో ఇలాంటి ఫ్లై ఓవర్ నిర్మించే అవకాశం ఉందని ప్రజలు కూడా అనుకోలేదు. కానీ రాష్ట్రంలో అత్యంత పొడవైన ఫ్లై ఓవర్‌గా నిర్మాణం జరిగింది. జాతీయ రహదారిపై ఉన్న ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది.
Recommended Video
వైసీపీ సర్కార్ హయాంలోనే..
వాస్తవానికి 9 నెలల్లోనే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తిచేస్తామని గత టీడీపీ ప్రభుత్వం బీరాలు పలికింది. అయితే కేంద్రం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాలేదు. దీంతో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి పచ్చాక కేంద్రంతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో నిధుల విడుదలయ్యాయి. దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది.












Click it and Unblock the Notifications