నిమ్మగడ్డ టీమ్‌లో మరో కొత్త అధికారి- ఐజీ సంజయ్ పాత్ర ఏంటి ? ఏకగ్రీవాల్ని అడ్డుకోగలరా ?
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో నాలుగు విడుతలుగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవాలుగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. అలా జరగకుండా అడ్డుకునేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యూహరచన చేస్తున్నారు. ఏకగ్రీవాల అడ్డుకట్టకు ఐజీ స్ధాయి ఐపీఎస్ అధికారి డాక్టర్ సంజయ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇంతకీ ఈ సంజయ్ ఎవరు ? ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఆయనేం చేయబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఏపీలో మరో పంచాయతీ- జగన్ వర్సెస్ నిమ్మగడ్డ పోరు సశేషం- తేలేది అక్కడే

ఏకగ్రీవాల అడ్డుకట్టకు ఐజీ స్ధాయి అధికారి
ఏపీలో గతేడాది ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాలపై విపక్షాల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అధికార వైసీపీ ప్రలోభాలకు, బెదిరింపులకు దిగడం ద్వారా పంచాయతీలను ఏకపక్షం చేస్తున్నాయని విపక్షాలు ఆరోపించాయి. దీంతో ఈసారి అలా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఎస్‌ఈసీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా తెరపైకి వచ్చిన పేరు ఐజీ సంజయ్. బలవంతపు ఏకగ్రీవాల అడ్డుకట్టకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తామని చెప్పిన ఎస్ఈసీ.. ఐపీఎస్ సంజయ్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో ఆయన నిన్న నిమ్మగడ్డ సమక్షంలోనే బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పంచాయతీ పోరులోకి కాలుమోపారు.

ఇంతకీ ఎవరీ ఐజీ సంజయ్
ఎప్పుడైతే రాష్ట్రంలో బలవంతపు ఏకగ్రీవాలు అడ్డుకునేందుకు ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటించారో అప్పుడే కీలక హోదాల్లో లేని ఓ సీనియర్ ఐపీఎస్‌ను ఎంచుకుంటారని తేలిపోయింది. అనుకున్నట్లుగానే జగన్ సర్కారులో కీలకంగా లేని సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన డాక్టర్ సంజయ్‌ను నిమ్మగడ్డ ఎంచుకున్నారు. ఇంతకీ సంజయ్ ఎవరు, ఆయన్ను నిమ్మగడ్డ ఎందుకు ఎంచుకున్నారనే దానికి సమాధానం ఇచ్చేలా ఉంది. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ ఉమ్మడి ఏపీతో పాటు విభజన తర్వాత కూడా పలు కీలక పోస్టుల్లో పనిచేశారు. మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు ఇలా ఎందరో సంఘ విద్రోహక శక్తులపై పోరాడిన చరిత్ర ఆయనది. గ్రేహౌండ్స్‌లోనూ పనిచేసిన అనుభవం ఉంది. ముక్కుసూటి మనస్తత్వం. బాలకృష్ణ కాల్పుల కేసులు, కృష్ణపట్నం పోర్టు ఆయిల్ స్కాంతో పాటు ఆయన కెరీర్‌లో ఎన్నో కీలక కేసులను డీల్ చేసిన అనుభవం ఉంది. డీజీపీ ఆఫీసులో టెక్నికల్ విభాగాధిపతిగా, గుంటూరు రేంజ్ ఐజీ, లా అండ్ ఆర్డర్ ఏడీజీగా కూడా పనిచేశారు. దీంతో ఆయన అయితేనే ఎన్నికల నియంత్రణకు సరిపోతారని నిమ్మగడ్డ భావించినట్లు తెలుస్తోంది.

ఏకగ్రీవాలను అడ్డుకోగలరా ?
గతంలో పోలీసు శాఖలో పలు కీలక పోస్టుల్లో పనిచేసిన సంజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. స్ధానిక పరిస్ధితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఎన్నికలే కాదు సాధారణ పరిస్ధితుల్లోనూ మావోయిస్టులనే ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నిమ్మగడ్డ ఆయన్ను ఎంచుకున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవాల అడ్డుకట్టలో సంజయ్ అనుభవం ఇప్పుడు కీలకంగా మారబోతోంది. ఓవైపు ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డకు ఆయన సహకరించాల్సిన పరిస్ధితి. దీంతో ఆయన ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది.

నిమ్మగడ్డ టీమ్‌లో టాప్ టూ ఆయనే
ప్రస్తుతం ఎన్నికల సంఘం అతికొద్ది మంది అధికారులతో పనిచేస్తోంది. పంచాయతీ ఎన్నికలే కాదు ఏ స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేంత సిబ్బంది అందుబాటులో లేరు. ప్రభుత్వం సహకరిస్తేనే సిబ్బంది కొరత తీరుతుంది. కానీ ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తుందో చూడాల్సి ఉంది. ఎన్నికలకు ముందే కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్‌ను సైతం నిమ్మగడ్డ ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డ తర్వాత కమిషన్‌లో స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన ఐజీ సంజయ్ ఇప్పుడు కీలకంగా మారిపోయారు. మరోవిధంగా చెప్పాలంటే నిమ్మగడ్డ తర్వాత కమిషన్‌లో టాప్ టూ స్ధానం కూడా ఆయనదే. దీంతో నిమ్మగడ్డతో పాటు సంజయ్ తీసుకునే నిర్ణయాలు కూడా కీలకం కాబోతున్నాయి.