మాచర్లలో బోండా, బుద్ధాలపై భయానక దాడి.. అసలు కారణం ఇదే.. స్థానిక ఎమ్మెల్యే వివరణ
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలపై దాడి ఘటన సంచలనంగా మారింది. మాచర్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ శ్రేణులు అడ్డుపడ్డారని తెలియడంతో.. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆదేశాల మేరకు బోండా, బుద్ధా బుధవారం మాచర్లకు వెళ్లగా.. పట్టణం నడిబొడ్డున భయానరీతిలో దాడి జరిగింది. ఇది చేసింది అధికార వైసీపీకి చెందినవాళ్లేనని, తమను హత్య చేయడానికే ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు కూడా ఊదాసీనంగా వ్యవహరించారని విమర్శించారు. అయితే..

ఏం జరిగిందంటే..
మాచర్లలో టీడీపీ నేతలపై దాడి ఘటనపై స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలకు భిన్నంగా ఘటనకు దారితీసిన కారణాలను ఆయన మీడియాకు వివరించారు. కాన్వాయ్ లాగా మాచర్ల టౌన్ లోకి దూసుకొచ్చిన టీడీపీ నేతల వాహనాల్లో ఒకటి.. రోడ్డు దాటుతోన్న పిల్లాడిని ఢీకొట్టిందని, ఇరుకు రోడ్డులో అంత స్పీడుగా ఎందుకు వెళుతున్నారని స్థానికులు నిలదీయడంతో... కారులో కూర్చున్న బోండా, ఇతర నేతలు దుర్భాషలాడారని, దీంతో ఒళ్లుమండిన స్థానికులు తమ ప్రతాపం చూపించారని ఎమ్మెల్యే తెలిపారు.
Recommended Video


అసలు వచ్చిందే అందుకు..
నిజానికి టీడీపీ నేతలు మాచర్ల వచ్చిందే గొడవలు రాజేయడానికని, స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం.. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే బోండా, బుద్ధాలు బుధవారం విజయవాడ నుంచి 10 కార్లలో గుండాలను వెంటేసుకుని మాచర్లకు వచ్చారని ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలన్నదే టీడీపీ పథకంగా కనిపిస్తున్నదని, కవాలనే గొడవపెట్టుకున్నారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.

రైతుల ముసుగులో..
ఇష్యూను తప్పుదారి పట్టించడం చంద్రబాబుకు తెలిసినంతగా మరే నాయకుడికీ తెలీదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాల నుంచి బయటపడటానికి సేవ్ అమరావతి పేరుతో లేని ఉద్యమాన్ని లేవదీసిన చంద్రబాబు.. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలచేత వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దాడులు చేయించారని, తాను కూడా ఆ దాడుల బాధితుడినే అని ఎమ్మెల్యే పిన్నెల్లి గుర్తుచేశారు. ‘‘పెద్ద బండరాళ్లతో నా కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన దృశ్యాలు ఎప్పటికీ మర్చిపోను. ఇదే పల్నాడులో గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు వైసీపీ నేతలైన అంబటి రాంబాబు, ముస్తఫాలపై టీడీపీ దాడి చేసింది''అని తెలిపారు.

టీడీపీ సీరియస్..
మాచర్లలో బోండా, బుద్ధాలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. దీన్ని వీలైనంత ఎక్కువగా ఫోకస్ చేయాలని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో వివరించాలని, మొత్తంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ప్రజల్లోనే ఎండగట్టాలని పార్టీ చీఫ్ చంద్రబాబు నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications