వసంత కృష్ణ ప్రసాద్ కీలక నిర్ణయం: వైసీపీలో కొనసాగడంపై తేల్చేసిన ఎమ్మెల్యే..!!
విజయవాడ: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలను గెలిస్తే మరో 30 సంవత్సరాల పాటు తిరుగు ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తోన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు.

అసంతృప్త నేతలతో..
అదే సమయంలో నియోజకవర్గ స్థాయిలో అసంతృప్త నేతలనూ కలుసుకుంటోన్నారు. గ్రామస్థాయిలో వారు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటోన్నారు. వాటిని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ క్రమంలో మైలవరం నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్త వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారాయన. శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ కొంతకాలంగా అసంతృప్త గళాన్ని వినిపిస్తూ వస్తోన్న నేపథ్యంలో ఆయనను తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.

పార్టీలోనే ఉంటా..
జగన్ ను కలిసిన అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో అన్ని విషయాలనూ వైఎస్ జగన్ కు వివరించానని, కార్యకర్తల అభిప్రాయాన్ని తెలియజేశానని, ఆయన సావధానంగా విన్నారని చెప్పారు. సొంత పక్షంలోనే కొన్ని విభేదాలు ఉన్నాయని జగన్ కు వివరించానని తెలిపారు. వాటిని తాను పరిష్కరిస్తానని జగన్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

తక్షణమే గడప గడపకు మన ప్రభుత్వం..
నియోజకవర్గంలో తాను ఎదుర్కొంటోన్న ఇబ్బందులను పరిష్కరిస్తానని జగన్ సంతృప్తికరంగా హామీ ఇచ్చారని, ఇక తక్షణమే తాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇప్పుడున్న వాట్సప్, సోషల్ మీడియా వంటి రాజకీయాల్లో దుష్ప్రచారాలు సహజమేనని, ప్రతి రాజకీయ నాయకుడు కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటన్నింటినీ అధిగమించాలని జగన్ సూచించారని అన్నారు.

నా మాట జగన్ బాట..
గతంలో తాను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విధేయుడిగా ఉన్నానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. వైఎస్ కుటుంబం పట్ల ఉన్న విధేయతతోనే తాను 2018లో వైఎస్ఆర్సీపీలో చేరానని గుర్తు చేశారు. ఇకపై పార్టీలోనే కొనసాగుతానని, ఊపిరి ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటాననీ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో తాను చాలాసార్లు చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానని అన్నారు. జగన్ నాయకత్వంలో పని చేస్తానని, వైసీపీలో కొనసాగుతానని తేల్చి చెప్పారు.

వైసీపీ సైనికుడిగా..
వ్యక్తిగత అవసరాల కోసమో, స్వార్థ రాజకీయాల కోసమో పార్టీ ఫిరాయించాల్సిన అవసరం తనకు లేదని వసంత చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడాయన కుమారుడి వెంటే ఉంటానని పేర్కొన్నారు. మైలవరంలో గానీ, జిల్లా స్థాయిలో గానీ.. రాష్ట్రంలో ఎక్కడైనా గానీ.. వైసీపీ బలోపేతానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వివరించారు. వైసీపీ సైనికుడిగా.. జగన్ ముఖ్య అనుచరుడిగా ఎప్పటికీ పార్టీలో ఉంటానని అన్నారు.












Click it and Unblock the Notifications