విశాఖ, విజయనగరం జిల్లాల్లో 12 తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
అమరావతి: రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని 12 తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు జిల్లాల్లోనూ ఆరు బృందాలు చొప్పున ఏర్పడిన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇతర సహాయ సిబ్బంది ఉన్నారు. మూడు బృందాలకు ఒక డీఎస్పీ పర్యవేక్షకుడిగా ఉన్నారు.
విశాఖ జిల్లాలో సోదాలను ఏసీబీ అదనపు ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలోని సీతమ్మధార, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ గ్రామీణం, అచ్యుతాపురం ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విశాఖలోని ఆరు ఎమ్మార్వో కార్యాలయాల్లో బుధవారమంతా ఏసీబీ సోదాలు కొనసాగాయి. సెలవు రోజున కూడా అధికారులు దస్త్రాలు పరిశీలించారు. 14.400 కాల్ సెంటర్ ఫిర్యాదులు, ఫోన్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.

సరైన కారణం లేకుండా దరఖాస్తులు, పరిశీలన చేయకుండా, పరిష్కరించకుండా తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదులపైనా సమగ్ర పరిశీలన చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. విశాఖ అర్బన్ సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయంలో దస్త్రాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు. కాగా, తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు రావడం గమనార్హం. గురువారం కూడా ఇక్కడ సోదాలు కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విజయనగరం జిల్లాలోని ఆరు తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు. విశాఖ సమీప మండలాలైన భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, ఎస్.కోట, కొత్తవలస, జామి తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీలు, 10 మంది సీఐల ఆధ్వర్యంలో ఆయా కార్యాలయాల్లో దస్త్రాలను పరిశీలించారు. భూ లావాదేవీలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇంటి స్థలాలు, కుల ధృవీకరణ పత్రాల జారీ, సిటిజన్ చార్ట్ అమలు తదితర అంశాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించినట్లు సమాచారం. పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో అన్ని అనుమతులు పూర్తై, రైతులకు పంపిణీ చేయని 471 పట్టాదారు పాసుపుస్తకాలు, 629 ఇళ్ల పట్టాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. భారీ ఎత్తున ఫిర్యాదులు రావడం, అనేక దస్త్రాలు పెండింగ్‌లో ఉన్నాయని బాధితులు పిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు ఈ మేరకు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications