బీజేపీ-జనసేన ఉమ్మడిగా: టీడీపీతో బెడిసికొట్టినట్టే- ఫలించని చంద్రబాబు లాబీయింగ్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ ప్రకటించారు.
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. విశాఖను రాజధానిగా అంగీకరించకపోవడం వల్ల ఉత్తరాంధ్రపై పట్టు కోల్పోయినట్టేనంటూ అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో టీడీపీ అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతోంది.. శాసన మండలి ఎన్నికల రూపంలో.

పట్టు నిలుపుకోవడానికి..
ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికను గెలిచి తీరాల్సి ఉంటుందని, దీని ఉత్తరాంధ్ర జిల్లాలపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో అభ్యర్థిని మార్చేయడానికీ వెనుకాడట్లేదు. ఇప్పుడదే జరిగింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఇదివరకు ప్రకటించిన మహిళా అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి తొలగించింది. ఆమె స్థానంలో వేపాడ చిరంజీవి రావు పేరును తెర మీదికి తీసుకొచ్చింది. ఆయనను తమ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.

బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా..
టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీ-జనసేన ఉమ్మడిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగింది. తమ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ పేరును ప్రకటించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఏపీ సహ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ ప్రకటించారు. 2024లోనూ ఇదే పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మారణం తమ రెండు పార్టీల వల్లే సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. పీవీఎన్ మాధవ్ ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాంతీయ పార్టీలతో నష్టం..
ప్రాంతీయ పార్టీలతో రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు ఒరిగేదేమీ ఉండదని సునీల్ దియోధర్ విమర్శించారు. పైగా ఏపీలో కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం చేయగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని తేల్చిచెప్పారు. వైసీపీ-టీడీపీ విఫల పార్టీలని ఆయన విమర్శించారు.

టీడీపీకి నిరాశేనా..
జనసేనతో పొత్తు పెట్టుకుని 2024 నాటి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలంటూ తెలుగుదేశం పార్టీ ఆశించినప్పటికీ- అది సాధ్యపడేలా కనిపించట్లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలే దీన్ని స్పష్టం చేస్తోన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు సాగిస్తోన్న లాబీయింగ్ ఇప్పటివరకు ఫలించనట్టే.












Click it and Unblock the Notifications