వైఎస్ జగన్.. ఆగస్టు నుంచి ''చలో వైజాగ్?''
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు నుంచి కొత్త పంథాలో పయనించబోతున్నారు. తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖపట్నంకు మారుస్తారంటూ మూడు సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కార్యాలయాన్ని ఎప్పుడూ తరలించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆలస్యం కాదని, ఆగస్టు నుంచి ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయాన్ని తరలిస్తున్నారంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రాజధానులకు సంబంధించి కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. అందుకే దాన్ని రాజధానిగా పిలవకుండా క్యాంప్ కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆగస్టు నెలలో మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని, ఆరోజు కార్యాలయాన్ని ప్రారంభిస్తామంటూ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. రాబోయే రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని విశాఖపట్నం నుంచి పరిపాలించాలనే యోచనలో తమ నేత ఉన్నారని, వారానికి ఐదురోజులు అక్కడే ఉండబోతున్నారని చెబుతున్నారు. క్యాంప్ కార్యాలయం స్థలం విషయంలో కూడా ఎటువంటి వివాదాలు లేకపోవడంతో ఎటువంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. అన్ని విభాగాలు కాకుండా ముఖ్యమైన, అవసరమైనంత మేరకే కొందరు అధికారులు విశాఖలో ఉండే అవకాశం ఉందంటున్నారు. అత్యవసరమైతే మరికొందరు అధికారులుకానీ, సిబ్బంది కానీ వచ్చివెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications