విశాఖపట్నానికి జగన్- అక్కడి నుంచే పాలన: వారంలో రెండురోజులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్- విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నారు. మార్చి 22 నుంచి వారంలో రెండు రోజుల పాటు విశాఖలో బస చేయనున్నారు. పల్లెనిద్ర కార్యక్రమాన్ని అక్కడి నుంచే ప్రారంభించనున్నారు.
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే నెల 14వ తేదీన ప్రారంభం కాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టొచ్చని తెలుస్తోంది.

జాప్యం లేకుండా..
విశాఖపట్నాన్ని రాజధానిగా బదలాయించబోతోన్నామని, తాను కూడా అక్కడికే తరలి వెళ్లబోతోన్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే స్వయంగా ప్రకటించారు. దేశ రాజధానిలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విశాఖకు తరలి వెళ్లడంపై తొలిసారిగా పెదవి విప్పారు.

వారంలో రెండురోజులు..
ఇందులో భాగంగా వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. విశాఖపట్నంలో వారంలో రెండు రోజుల పాటు బస చేయాలని నిర్ణయించుకున్నారు. మార్చి 22వ తేదీ నుంచి వారంలో రెండు రోజుల పాటు విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి సమాయాత్తమౌతోన్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో ఆయన అక్కడే బస చేయనున్నారు. ఈ రెండు రోజులు కూడా అధికారిక సమావేశాలు, సమీక్షలన్నీ విశాఖ నుంచే కొనసాగించనున్నారు.

విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్..
ఈ రెండు రోజులు ఆయన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అతిథి గృహంలో బస చేస్తారని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి బస చేయడానికి అనువుగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్ హౌస్ లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో విశాఖలో బస చేసిన అనంతరం బుధవారం నాడు వైఎస్ జగన్- పల్లె నిద్రకు బయలుదేరి వెళ్తారని సమాచారం. పల్లెనిద్రను ముగించుకున్న తరువాత మళ్లీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు.

ఖాళీ భవనాల్లో..
విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ భవనాలను పరిపాలనకు అనువుగా తీర్చిదిద్దాలంటూ ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు. దీనితో పాటు- భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలను కూడా దీనికోసం వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగులను కూడా గుర్తించినట్లు సమాచారం.

జోరుగా నిర్మాణ పనులు..
ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తన కేంద్ర కార్యాలయం భవన నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన ఎండాడ పనోరమా హిల్స్‌లో వైవీ సుబ్బారెడ్డి ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడా పనులు ఊపందుకున్నాయి. శాశ్వత క్యాంప్ కార్యాలయం కూడా అందులోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ లోగా పూర్తిస్థాయిలో విశాఖకు తరలి వెళ్లాల్సి ఉంటుందని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications