ఏపీలో రోజుకో స్కూల్ లో కరోనా కల్లోలం .. విశాఖ స్కూల్ లో ఆరుగురికి పాజిటివ్, జగన్ సర్కార్ కు పరేషాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త సమస్య తయారైంది. పాఠశాలలు తెరవకుంటే విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని నష్టపోతారనే సమస్య, తీరా పాఠశాలలు తెరిస్తే కరోనా మహమ్మారి బారిన పడి విద్యార్ధి లోకం విలవిలలాడుతుందనే సమస్య వెరసి జగన్ సర్కారు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఒకపక్కన విద్యార్థులకు స్కూళ్ళు నడిపితే బాగుండు అన్న అభిప్రాయం తల్లిదండ్రులకు ఉన్నా మరోపక్క కరోనా కేసులు పెరుగుతుండటం తల్లిదండ్రులకు పిల్లలను స్కూళ్లకు పంపాలంటే ఆందోళన కలిగిస్తుంది.

ఏపీలో రోజుకో స్కూల్ లో కరోనా కలకలం
స్కూళ్ళు తెరవకపోతే ఓ బాధ తెరిస్తే మరో బాధ అన్నట్టుంది ఏపీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లను కరోనా మహమ్మారి వదలనని పట్టిపీడిస్తున్న క్రమంలో రోజుకో స్కూల్లో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా విశాఖ స్కూల్స్ లోనూ కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం ఎల్లపు వాని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపుతుంది. ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
విశాఖ నగరంలో ఓ స్కూల్ లో ఆరుగురు విద్యార్థులకు కరోనా
ఈనెల 23వ తేదీన పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డట్టుగా తెలిసింది. కరోనా బారిన పడిన విద్యార్థులలో ముగ్గురు ఎల్లపు వాని పాలెం కు చెందిన వారు కాగా, మరో ఇద్దరు సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు .ఇంకొకరు కొత్తపాలెం ప్రాంతానికి చెందిన విద్యార్థి. దీంతో పాఠశాల ప్రాంగణంలో, కరోనా బారిన పడిన విద్యార్థుల ఇళ్లవద్ద శానిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక స్కూల్లో ఆరుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ కావడంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయం తెలియటంతో తల్లిదండ్రులు స్కూల్ కు పంపకుండా చాలా మంది చిన్నారులను ఇళ్లకే పరిమితం చేశారు.
కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తున్నా ఏపీ స్కూల్స్ లో కరోనా
ఆగస్టు 16వ తేదీ నుండి స్కూల్స్ ని పునఃప్రారంభం చేసిన ఏపీ సర్కార్ స్కూల్స్ లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, కరోనా నిబంధనలను పాటిస్తున్నా ఏపీ స్కూల్లో పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతోంది. నిత్యం ఏదో ఒక స్కూల్లో కరోనా కేసులు నమోదు అవ్వడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా ముదినేపల్లి పెద్ద పాలపర్రు జడ్పీ హైస్కూల్ లో 10 మంది విద్యార్థులకు కరోనా మహమ్మారి సోకగా తాజాగా బొబ్బిలి పరిధిలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 10మంది విద్యార్థులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
Recommended Video

స్కూల్స్ పై డైలమాలో తల్లిదండ్రులు, జగన్ సర్కార్
ఇక నిత్యం అనేక స్కూళ్లలో కరోనా కేసులు నమోదవుతున్న తీరుతో ముందు ముందు పరిస్థితి ఎలా మారుతుందో అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇక పాఠశాలల్లో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. పిల్లల చదువులు మరిచిపోతున్నారని స్కూళ్లకు పంపితే, చివరికి వారి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని భయపడుతున్నారు. ఇక స్కూల్స్ లో పెరుగుతున్న కేసులపై ఏం చేయాలో అర్థం కాని సంకట స్థితిలో ఏపీ ప్రభుత్వం డైలమాలో పడింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా కరోనా కేసులు పెరుగుతున్న తీరు స్కూల్స్ లో పనిచేసే సిబ్బందికి, యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు, అలాగే ఉపాధ్యాయులకు, ప్రభుత్వానికి సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications