అందుకున్న రోజా: లా పాయింట్లు
Rushikonda Buildigs: విశాఖపట్నం సమీపంలోని రుషికొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం.. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడినట్టయింది కూటమికి.
తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇటీవలే రుషికొండ భవనాలను మందీ మార్బలం, మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయతో కట్టించారని, అందులో 26 లక్షల రూపాయల విలువ చేసే బాత్ టబ్ ఉందంటూ టీడీపీ సైతం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి దీన్ని ట్వీట్ చేసింది.

ఈ వ్యవహారం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. మాటల యుద్ధానికి తెర తీసింది. ఇదివరకే ఈ వివాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సచివాలయం నిర్మాణ నాణ్యత గురించి ప్రశ్నించారు.
తాజాగా పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్ కే రోజా.. దీనిపై స్పందించారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రశ్నలవర్షాన్ని కురిపించారు. హైదరాబాద్‌లో చంద్రబాబు 100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించుకున్న ఇళ్లు, దాని నిర్మాణ సమయంలో కుటుంబం మొత్తం అత్యంత విలాసవంతమైన పార్క్ హయత్ హోటల్‌లో నివసించడాన్ని గుర్తు చేశారు.
రుషికొండ వద్ద పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా అంటూ ప్రశ్నించారు రోజా. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని నిర్మించామని చెప్పారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయాన్ని కట్టినవాళ్లు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
రుషికొండ వద్ద నిర్మాణాలు చేపట్టడానికి 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమగ్ర వివరాలను ఇచ్చామని, అందులో పొందుపరిచినట్టే వాటిని కట్టామని చెప్పారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తరువాతే నిర్మాణాలు చేపట్టామని అన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని, అక్రమం ఎక్కడుందని రోజా ప్రశ్నించారు.
విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం, ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా అని రోజా నిలదీశారు.
ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా అని అన్నారు. ఇన్నాళ్లూ ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..? అని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో కోట్ల రూపాయలతో సొంతిల్లు కట్టుకుని, దాని నిర్మాణ సమయంలో విలాసవంతమైన పార్క్ హయత్ హోటల్‌లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెగా చెల్లించిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకలు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రోజా అన్నారు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత హైదరాబాద్‌లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్ల రూపాయలతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. వైఎస్ జగన్, తమ పార్టీ నేతలపై ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications