గేరు మార్చిన విశాఖ ఉక్కు ఉద్యమం: సాగు చట్టాల రద్దుతో జోష్.. జగన్ కు లేఖ; ప్లాన్ ఇలా!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం తీసుకువచ్చిన 3 సాగు చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో విశాఖ ఉక్కు కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు కోసం కూడా రైతులు చూపిన మార్గంలో పోరాటం చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేసేదాకా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమంలో గేరు మార్చి ముందుకు సాగాలని నిర్ణయించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం .. వంటా వార్పు కార్యక్రమం
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే ఆలోచనలో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాల రద్దును ప్రకటించినట్లే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తమ ఆందోళనను తెలియజేస్తున్నారు.

ప్రధాన కూడళ్ళలో వంటా వార్పు నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు
శుక్రవారం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉక్కు నగరం, కూర్మన్నపాలెం కూడలి, పెదగంట్యాడ, తెలుగు తల్లి విగ్రహం తదితర ప్రాంతాలలో జరుగుతున్న నిరసనలలో విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వంటా వార్పూ చేసి రోడ్లపై నిరసనలు తెలియజేస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసినట్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

రైతుల పోరాటం ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమం విస్తరించే పనిలో కార్మికలోకం
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే ఆలోచనలో ఉంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలన్న ఆలోచనలో ఉన్నారు కార్మికులు. రైతు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనికోసం తగిన కార్యాచరణను రూపొందించారు. ఇప్పటికే 288 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఉద్యమాన్ని విస్తరించే పనిలో పడ్డాయి.

వివిధ జిల్లాలలో ఉక్కు ఉద్యమాన్ని విస్తరించటానికి సభలు, సమావేశాలు
సాగు చట్టాలపై కేంద్రం వెనకడుగు వేయడంతో గట్టిగా పోరాటం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రం వెనకడుగు వేస్తోంది అన్న భావన కార్మికుల వ్యక్తమౌతుంది. ఇక ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ఢిల్లీలోని రైతు సంఘం నాయకులు కూడా సంఘీభావాన్ని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తో పోరాటం చేయడానికి ఇది సరైన సమయం అని స్టీల్ ప్లాంట్ కార్మికులు భావిస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.ఈ క్రమంలో ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా వివిధ జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మోడీపై ఒత్తిడి తేవాలని ఏపీ సీఎం జగన్ కు మరోమారు లేఖ
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని అడ్డుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఉక్కు పరిరక్షణ పోరాట సమితి లేఖ రాసింది. శాసనసభలో మరోసారి చర్చించి రాష్ట్ర నిర్ణయాన్ని కేంద్రానికి పంపాలని అభ్యర్థించింది. అంతేకాదు మరోమారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై నిర్ణయం మార్చుకోవాలని ప్రధానికి లేఖ రాయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని విస్తరించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారని భావిస్తున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బిజెపి మినహాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. కార్మిక పోరాటానికి మద్దతుగా నిలబడతామని చెబుతున్నాయి.