గీతం మెడికల్ కాలేజ్ గ్రౌండ్ చుట్టూ కంచె!
విశాఖపట్నంలోని గీతం వైద్య కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నగరంలో రచ్చ జరుగుతోంది. భీమిలీ ఆర్డీవో, విశాఖపట్నం డీఆర్వో పర్యవేక్షించగా కళాశాల మైదానం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు.
గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారంతోపాటు వైద్య కళాశాల వద్ద పోలీసులను భారీసంఖ్యలో మోహరింపచేశారు. అంతేకాకుండా ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మైదానాన్ని స్వాధీనం చేసుకొని కంచె ఏర్పాటు చేయడంపై గీతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికారులు కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడింది.

వైసీపీ సర్కార్ ఎక్కడెక్కడ సర్కార్ స్థలాలు ఉన్నాయో లెక్కలు తీస్తోంది. ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసినా, చేస్తున్నా కూల్చేస్తోంది. ఇటీవలే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీగోడ విషయంలో జరిగిన రాద్ధాంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా గీతం వైద్యకళాశాల మైదానాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బాలకృష్ణ చిన్న అల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు అయిన భరత్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన భరత్ విశాఖ లోక్ సభ నియోజకవర్గం నుంచి 5వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారాు.
గీతం వైద్య కళాశాలకు ఆనుకొనివున్న 14 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని భీమిలీ ఆర్డీవో భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. రుషికొండ గ్రామ సర్వే నంబర్ 37, 38లోని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని, గతంలోనే ఈ స్థలాన్ని మార్క్ చేశామని, 5.25 ఎకరాల్లో కంచె వేశామని తెలిపారు. 10 చోట్ల ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డులు పెట్టామని చెప్పారు. అయితే ఇదంతా ప్రభుత్వం రాజకీయ దురుద్దేంతోనే చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications