వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన కొత్త తరహా ఉద్యమం: అంతా డిజిటల్ మయం
విశాఖపట్నం: రాష్ట్రానికి తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసనగా జనసేన పార్టీ కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ క్యాంపెయిన్‌ను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం ఈ క్యాంపెయిన్ మొదలైంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. దీని ప్రధాన ఉద్దేశం.
దీనిద్వారా స్థానిక లోక్‌సభ సభ్యులపై ఒత్తిడిని తీసుకుని రావాలని జనసేన భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నడుస్తోన్నాయి. రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. గురువారం నాటితో ఈ సమావేశాలు ముగియనున్నాయి. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునేలా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం ఎంపీలు సభలో కేంద్రంపై ఒత్తిడిని తీసుకుని రావడానికి జనసేన పార్టీ ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను చేపట్టింది.

ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వాటిని ఫేస్‌బుక్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో పోస్ట్ చేస్తున్నారు. దీనికి తమ నియోజకవర్గం ఎంపీ పేరును హ్యాష్‌ట్యాగ్ చేస్తోన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని రాసివున్న ప్లకార్డులను జనసేన పార్టీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు. #SaveVizagSteelPlant, స్థానిక ఎంపీ పేర్లతో హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎనిమిది గంటల పాటు ఈ దీక్ష కొనసాగింది. అంతకుముందు- విశాఖపట్నంలోనూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. వారికి తన సంఘీభావాన్ని తెలిపారు. దీనికి కొనసాగింపుగా డిజిటల్ క్యాంపెయిన్‌ను చేపట్టింది జనసేన.

పార్లమెంట్ సమావేశాలు ముగింపుదశకు వచ్చిన నేపథ్యంలో- రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యులు ఈ అంశాన్ని సభలో లేవనెత్తాలనేది జనసేన ప్రధాన డిమాండ్. ఇప్పటికే వైసీపీ, టీడీపీ సభ్యులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తమ గళాన్ని వినిపించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన దీక్షలు, ఆందోళనలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ సైతం ఈ ఆందోళనలకు అండగా నిలిచింది. పార్టీ అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications