జనసేనకు మరో కీలక నేత గుడ్ బై : వైసీపీలో చేరాలని నిర్ణయం : సీఎం జగన్ ఆమోదం..!!
జనసేనలో మరో కీలక నేత పార్టీ వీడాలని నిర్ణయించారు. ఆయన అధికార వైసీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. ఆయన రాకకు పార్టీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ ఆమోద ముద్ర వేసారు. దీంతో..గిరిజన వర్గానికి చెందిన ఆ నేత త్వరలో వైసీపీలో చేరనున్నారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. గత ఏడాది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన లో చేరి..తాజా ఎన్నికల్లో పోటీ చేసారు. ఉత్తరాంధ్ర గిరిజన నాయకుడిగా ఆయనకు ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. వైయస్సార్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు ఆయన మంత్రిగా పని చేసారు. ఇక, ఇప్పుడు జనసేన వీడి వైసీపీలో చేరే అంశం పైన అనుచరులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత పార్టీ వీడుతున్న విషయాన్ని స్పష్టం చేసారు.
జనసేనకు బాలరాజు గుడ్ బై..!!
మాజీ మంత్రి..గిరిజన నేత పసుపులేటి బాలరాజు జనసేన వీడాలని నిర్ణయించారు. ఆయన గత ఏడాది కాంగ్రెస్ నుండి జనసేనలో చేరారు. ఆయన జనసేన నుండి ఎన్నికల్లోనూ పోటీ చేసారు. అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు. బాలరాజు వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి వైసీపీలో చేరనున్నారని, ఆయన చేరికను ముఖ్యమంత్రి జగన్ కూడా స్వాగతించారనే ప్రచారం ఏజెన్సీలో విస్తృతంగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా బాలరాజు సన్నిహితులు.. కార్యకర్తలతో పార్టీ మారుతున్నట్టు పరోక్షంగా చెప్పకనే చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై బాలరాజుని విలేకరులు ప్రశ్నించగా, కాలమే నిర్ణయిస్తుందని సమాధానం ఇచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం బాలరాజు తమ పార్టీలో చేరటం ఖాయమైందని..పార్టీ ముఖ్య నేతలు సైతం ఆమోదం తెలిపారని చెబుతున్నారు. బాలరాజు సైతం తాజాగా ముఖ్యమంత్రి జగన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్ అమలులోకి తీసుకొచ్చారన్నారు.

వైయస్ హాయంలో మంత్రిగా..
బాలరాజు 2009లో వైయస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా పని చేసారు. వైయస్ తరువాత రోశయ్య..కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోనూ మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన విషయం లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని..విభజనకు అనుకూలంగా మాట్లాడారు. 2014లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఎన్నికల్లో ఓడారు. ఇక, గత ఏడాది జనసేనలో చేరిన బాలరాజు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా వ్యవహిరించారు. ఎన్నికల్లో పార్టీ పరాజయం తరువాత ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. అనారోగ్యంతో కొంత కాలం రాజకీయాలక దూరంగా ఉన్న బాలరాజు ఇప్పుడు వైసీపీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వైసీపీలోని కొందరు ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ముఖ్యమంత్రి సైతం జగన్ అంగీకారం తెలిపారని త్వరలోనే ముహూర్తం చూసుకొని బాలరాజు వైసీపీలో చేరుతారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో..జనసేన నుండి వరుసగా మరో కీలక నేత రాజీనామా చేయటం ఖాయమైంది.












Click it and Unblock the Notifications