ఏపీ, తెలంగాణ బేఫికర్: మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

బంగాళాఖాతంలో వరుస ఆవర్తనాలు..
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర- ఒడిషా దక్షిణ ప్రాంత జిల్లాల తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన వాతావరణానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతిదిశ వైపునకు వంపు తిరిగి ఉందీ ఉపరితల ఆవర్తనం. తూర్పు - పశ్చిమ షియర్ జోన్ వెంబడి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల మధ్య ఏర్పడి ఎత్తుకి వెళ్లే కొద్దీ దక్షిణం వైపునకు వంపు తిరిగి ఉంది.

బెంగాల్ తీరానికి సమీపంలో..
పశ్చిమ బెంగాల్ కోస్తా తీరానికి దగ్గరగా వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే దీనికి కారణమని పేర్కొన్నారు. సముద్రమట్టం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల ఎత్తున ఈ ఆవర్తనం విస్తరించిందని, దీని ప్రభావం కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని స్పష్టం చేశారు. మరో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంలో ఏర్పడిందని దీని ప్రభావం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉందని తెలిపారు.

5.8 కిలోమీటర్ల ఎత్తున
సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడన ద్రోణిగా మారింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తోన్నారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏపీలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర సహా...
ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం..ఉత్తర కోస్తాలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదివరకే భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాకు ఆనుకుని ఉన్న రాయలసీమ రీజియన్‌పైనా అల్పపీడన ద్రోణి ప్రభావం కనిపించింది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. ఎండ తీవ్రత చాలావరకు తగ్గింది.

సీమపైనా ఎఫెక్ట్..
చిత్తూరు జిల్లాలో తేలికపాటి జల్లులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే- కర్ణాటక మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల ఆ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న సీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుపతి, గుంటూరు, నూజివీడుల్లో ప్రస్తుతం భారీ వర్షం కురిసింది. కడప జిల్లా జమ్మలమడుగు, పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. తెలంగాణలోనూ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిశాయి.

తెలంగాణలో
ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణలోని పలు ప్రదేశాల్లో నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సైతం ధృవీకరించింది. వచ్చే 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఒకటి, రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే పరిస్థితి మరో ఒకట్రెండు రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications