మూడు రాజధానుల ఆయువుపట్టుపై పవన్ కల్యాణ్ ఆ నాలుగు ప్రశ్నలు..!!
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానుల ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటయ్యాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, మేధావులు, విద్యావేత్త, సామాజికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉందనే విషయాన్ని తేల్చి చెప్పారు. ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండటానికి మూడు రాజధానులను నెలకొల్పాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు.

రాజకీయేతర జేఏసీ ఏర్పాటు..
మూడు రాజధానులను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలనీ డిమాండ్ చేస్తోన్నారు. దీనికోసం ఐక్యకార్యాచరణ కమిటీ సైతం ఏర్పాటైంది. రాజకీయేతర జేఏసీలో విద్యా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ లజపతి రాయ్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుడు దేముడు కో కన్వీనర్‌గా ఉన్నారు.

విశాఖ గర్జన..
విశాఖపట్నాన్ని వెంటనే కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించలనే డిమాండ్‌తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన ఆందోళనను చేపట్టనుంది ఈ జేఏసీ. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, దీనికి మద్దతుగా ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు తెలిపింది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించడానికి తాము స్వాగతిస్తోన్నామని, దీన్ని వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది. విశాఖలోని ఎల్‌ఐసీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద 15వ తేదీ ఉదయం 10 ర్యాలీ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది.

కీలక ఉద్యమంపై..
రాజధాని సాధనలో అత్యంత కీలకంగా భావిస్తోన్న ఈ విశాఖ గర్జనపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్ అనంతరం.. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌ను అందుకున్నారు. దేనికి గర్జనలు అంటు ప్రశ్నించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌పై వరుస పోస్టులు పెట్టారు.

దేనికి గర్జనలు..
మూడు రాజధానులతో రాష్ట్రం ఇంకా అధోగతి పాలవుతుందని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాటానికా ఈ గర్జనలు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నందుకా? అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వలసలు ఆపలేక..
మత్స్యకారులు తమ సొంత తీరంలో చేపల వేటకు వెళ్లే అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నైకి వలస వెళ్తోన్నారని గుర్తు చేశారు.
విశాఖపట్నంలో రుషికొండను అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా ధ్వంసం చేస్తోన్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నాయకులు తమ కోసం భవనాలను నిర్మించుకుంటోన్నందుకు విశాఖక గర్జనను నిర్వహించుకుంటోన్నారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దసపల్లా భూములను సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా అంటూ నిలదీశారాయన.

రోడ్లు వేయనందుకా..
రోడ్లు వేయనందుకా? చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? అంటూ పవన్ కల్యాణ్ రాజకీయేతర జేఏసీ ప్రతినిధులను ప్రశ్నించారు. సీపీఎస్ మీద మాట మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వ లేదని, పోలీసులకు టీఏ, డీఏలను మంజూరు చేయట్లదని మండిపడ్డారు.