అర్హతలు ఉంటే..అగ్నివీరులు మీరే: విశాఖపట్నంలో నియామకాలు: పోటెత్తిన అభ్యర్థులు
విశాఖపట్నం: దేశంలో అత్యంత వివాదాస్పదమైన పథకం.. అగ్నిపథ్. త్రివిధ దళాల్లో చేరడానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే కొత్తగా ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత చెలరేగింది. వేలాదిమంది అభ్యర్థులు తమ నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించారు. రైల్వే స్టేషన్లు, రైళ్లను తగులబెట్టారు. సికింద్రాబాద్‌లోనూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అదే సమయంలో పలువురు అభ్యర్థులు ఈ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు విచారణ దశలో ఉన్నాయి. దీనిపై వ్యతిరేకత కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే ఆర్మీ అధికారులు నియామకాలకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియమాకాలు దశలవారీగా కొనసాగుతున్నాయి. అర్హత గల వారు అగ్నిపథ్ కింద సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతోన్నారు.

ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలోనూ అగ్నివీరుల నియామకాలు ఇవ్వాళే మొదలయ్యాయి. ఈ నెల చివరి వరకూ కొనసాగనున్నాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో అగ్నివీరులకు సంబంధించిన నియామకాలను చేపట్టారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ కనీసం 2,500 నుంచి 3,000 మంది అభ్యర్థులు ఇందులో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని ఆర్మీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకవైపు మార్గాన్ని అధికారులు మూసివేశారు. రామకృష్ణా జంక్షన్ నుంచి సీహార్స్ జంక్షన్ వరకు వన్ వే రోడ్డును మూసివేశారు. ఒకే మార్గంలో వాహనదారులు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. స్టేడియం వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, పోలీసులు ఏర్పాట్లు చేశారు. 500 మందికి పైగా పోలీసులను అక్కడ నియమించారు.
Recommended Video

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభ్యర్థులు విశాఖకు చేరుకుంటోన్నారు. పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకం కింద నియామకాలు ఇదివరకే మొదలయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో జోరుగా అపాయింట్‌మెంట్స్ సాగాయి. ఈ పథకంపై ఉన్న వ్యతిరేకత మొత్తం చెదిరిపోయేలా దేశవ్యాప్తంగా వేలాదిమంది అభ్యర్థులు ఆర్మీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.












Click it and Unblock the Notifications