విశాఖలో దారుణ ఘటన... వివాహితపై మరో మహిళ యాసిడ్ ఎటాక్
విశాఖపట్నంలో ఎవరూ ఊహించని దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళపై మరో మహిళ యాసిడ్‌తో దాడి చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఒక వివాహితపై గుర్తు తెలియని మహిళ యాసిడ్ పోసి పరారైంది. యాసిడ్ పోయటంతో వివాహిత శరీరం ముప్పై శాతానికి పైగా కాలినట్లు తెలుస్తుంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విశాఖపట్నంలోని గాజువాకలో దారుణం
విశాఖపట్నంలోని గాజువాక సమతానగర్‌లో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన 27ఏళ్ల శిరీష బుధవారం మధ్యాహ్నం సమతానగర్‌లోని అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న తన ఆడపడుచు దివ్య వద్దకు వచ్చారు. శిరీష దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండడంతో, శిరీష కు కౌన్సిలింగ్ ఇవ్వడానికి దివ్య దగ్గరకు శిరీషను పంపించినట్టుగా తెలుస్తుంది.

వివాహిత శిరీషపై యాసిడ్ తో దాడి చేసిన గుర్తు తెలియని మహిళ
అయితే సాయంత్రం ఐదు గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చి సెల్లార్‌లో శిరీషతో దాదాపు రెండు గంటల పాటు వాగ్వాదం చేసింది. చివరకు వెంట తెచ్చిన సీసాలోని యాసిడ్‌ను శిరీష ముఖంపై పోసేందుకు ప్రయత్నించగా, శిరీష తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ శిరీషకు 30 శాతం గాయాలయ్యాయి. యాసిడ్ దాడిలో గాయపడిన ఆమెను అపార్ట్‌మెంట్‌వాసులు గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు
శిరీష భర్త ప్రభాత్ హైదరాబాద్‌లోని ఒక బంగారం దుకాణంలో పనిచేస్తున్నారు. శిరీష పై దాడికి పాల్పడింది శిరీషకు పరిచయస్థుడైన వ్యక్తి భార్యనేమో అన్న క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆర్కె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన గంటల వ్యవధిలోనే శిరీష పై యాసిడ్ దాడి జరగడంతో పోలీసులు శిరీష కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారి నుండి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరిపైన అయినా అనుమానం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications