ఎన్నికల వేళ.. రాజధాని అమరావతిపై యూటర్న్
Visakhapatnam: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఇంకో నాలుగు రోజులే మిగలివున్నాయి. వచ్చే సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.
శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి, ప్రముఖ నటుడు, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాజధాని అంశంపై ఆయన తన మనసులో మాటను బయటపెట్టిన వీడియో అది.
ఏపీ రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నమే బెటర్ అంటూ ఆయన అభిప్రాయపడ్డారీ వీడియోలో. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి మనవద్ద అంత డబ్బులు లేవని ఆయన స్పష్టం చేశారు. అమరావతితో పోల్చుకుంటే విశాఖపట్నమే చాలా వేగంగా అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు.
విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చితే అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో ఏపీ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భరత్ చెప్పారు. రాజధానిగా అమరావతిని డెవలప్ చేయడానికి పెట్టుబడులు చాలా అవసరమౌతాయని, అంత పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పారాయన.
2014 నుంచి 2019 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలుగా ఉండేదని భరత్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల రూపాయలను తెచ్చి అమరావతిలో పెట్టలేమనీ అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే- ఎలాంటి వనరులు, గ్రోత్ ఇంజిన్ అవసరమౌతాయనేది చూడాల్సిన అవసరం ఉందని భరత్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఓ గ్రోత్ ఇంజిన్ వంటిదేనని పేర్కొన్నారు. అమరావతిని డెవలప్ చేయాలంటే 20 సంవత్సరాలు పడుతుందని, వెంటనే చేయలేమని చెప్పారు.












Click it and Unblock the Notifications