నాన్నా.. నన్ను బయటికి తీయండి -బస్సు చక్రాల కింద నలిగి యువతి ఆర్తనాదం -విశాఖలో ఘోర ప్రమాదం
ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెరిగింది.. చదువులోనూ ఎక్కడా తగ్గకుండా డిగ్రీ పూర్తి చేసింది.. ఎంట్రెన్స్ లో సీటు సాధించి బీఈడీలోనూ చేరేందుకు సిద్ధమైంది. కాలేజీలో థంబ్ ప్రింట్ వేసేందుకు తండ్రితో కలిసి బైక్ పై బయలుదేరిన ఆ యువతి అనూహ్యరీతిలో ప్రమాదానికి గురైంది.. బస్సు చక్రాల కింద నలిగిపోతూ.. నాన్నా కాపాడండని ఆర్తనాదాలు చేసింది.. కాసేపు నరకయాతన తర్వాత ప్రాణాలు కోల్పోయింది.. విశాఖపట్నంలో శనివారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో విద్యార్థిని చనిపోగా, ఆమె తండ్రికి గాయాలయ్యాయి. పోలీసులు చెప్పిన వివరాలివి..
జగన్ మరో సంచలనం: రెస్కోలకు మంగళం -డిస్కాముల్లో విలీనం -కుప్పం రెస్కోపై చంద్రబాబు ఘాటు లేఖ

మృతురాలు గీతా కుమారి
బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన ఘటన విశాఖలో సంచలనంగా మారింది. స్థానిక గాజువాక భవానీనగర్‌కు చెందిన సమ్మిడి గీతాకుమారి (21) బీఈడీలో చేరేందుకు తండ్రి వెంకటరావుతో ద్విచక్రవాహనంపై ఎంవీపీ కాలనీకి బయలుదేరింది. ఎన్‌ఏడీ జంక్షన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత వెనుకనుంచి వస్తున్న ప్రైవేటు బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పింది. వెంకట్రావు రోడ్డు అంచు వైపునకు పడగా, వెనక కూర్చున్న గీతాకుమారి కుడివైపుగా బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది..

నాన్నా.. నన్ను బయటికి తీయండి..
బస్సు వేగం నియంత్రణ కాకపోవడంతో ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో నడుం భాగం బాగా దెబ్బతింది. ఆమె నడుమ మీదుగా బస్సు వెళ్లిపోవడమే కాకుండా కొంతదూరం ఈడ్చుకుపోయింది. కడుపు భాగమంతా తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో తనకు ఏం జరిగిందో తెలియని గీతాకుమారి.‘‘నాన్నా రండి... నన్ను బయటకు తీయండి నాన్నా'' అంటూ విలపించింది. ఆమె ఆర్తానాదాలు అక్కడున్నవారి హృదయాలను కలచివేశాయి.
కర్నూలు కల సాకారం -ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సర్వీసులు ప్రారంభం -తొలి విమానానికి మంత్రుల స్వాగతం

కేజీహెచ్‌లో తుది శ్వాస..
ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు జోన్ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని గీతాకుమారిని నగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్న అక్కడి వైద్యుల సూచనతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లగా... చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందింది. కడుపు భాగంలో అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి వెంకట్రావుకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎయిర్‌పోర్టు జోన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.