చిన్నారి మృతదేహంతో స్కూటీపై 120 కి.మీప్రయాణం-కేజీహెచ్ ఆస్పత్రి వివరణ ఇదే...
విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చిన్నారి మృతదేహంతో తల్లితండ్రులు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు వెళ్లినట్లు వచ్చిన వార్తలపై కేజీహెచ్ స్పందించింది.
విశాఖలోని చారిత్రక కింగ్ జార్జ్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం ఓ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో తాజాగా ప్రసవించిన ఓ మహిళ తన బిడ్డను తీసుకుని వచ్చింది. అయితే చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. దీంతో సొంతూరు అయిన పాడేరుకు వెళ్లేందుకు అంబులెన్స్ కోసం వారు ఆస్పత్రిని అడిగారు. కానీ కేజీహెచ్ సిబ్బంది అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో వారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకు తమ సొంత స్కూటీపై ప్రయాణం చేసి వెళ్లినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఇవాళ కేజీహెచ్ అధికారులు వివరణ ఇచ్చారు.
విశాఖ జిల్లా ముంచంగి పుట్టు మండలం కుముడు గ్రామానికి చెందిన మహేశ్వరి అనే మహిళ ఈ నెల 2న పాడేరులో తెల్లవారు జామున నాలుగున్నర గంటలకు ప్రసవించింది. అయితే బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న చిన్నారిని డాక్టర్లు ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. కానీ రెండు వారాల చికిత్స తర్వాత కూడా కోలుకోని బాలుడు ఈ ఉదయం 7.50 సమయంలో ప్రాణాలు విడిచాడు.

దీంతో కేజీహెచ్ ఆస్పత్రి డాక్టర్లు ట్రైబల్ కో ఆర్డినేటర్ కు సమాచారం ఇచ్చి అంబులెన్స్ సమకూర్చమని తెలిపారు. కానీ అతను అంబులెన్స్ కోసం జిల్లా వైద్యాధికారిని సంప్రదించి ఏర్పాట్లు చేసే లోపు తల్లితండ్రులు తమ పిల్లాడి మృతదేహంతో ఆస్పత్రి నుంచి పాడేరు బయలుదేరారు. ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే వారు వెళ్లిపోయినట్లు గుర్తించిన అధికారులు.. ఆరా తీశారు. చివరికి పాడేరు వద్ద వారు వెళ్తున్న స్కూటీని గుర్తించి అంబులెన్స్ ఏర్పాటు చేసి వారి స్వగ్రామం ముంచంగిపుట్టు మండలం కుముడుకు పంపినట్లు కేజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటన విడుదల చేశారు.












Click it and Unblock the Notifications