విశాఖ ఉక్కుపై పునరాలోచించండి- కేంద్రాన్ని కోరిన వైసీపీ- ప్రత్యేక హోదాపైనా..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణ వ్యవహారంపై ఇవాళ మరోసారి పార్లమెంటులో చర్చ జరిగింది. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని వైసీపీ ఎంపీలు ఇవాళ కేంద్రాన్ని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా పలు ప్రత్యామ్నాయాలను వారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఆర్ధిక నష్టాల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల మరిన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఆంధ్రుల సుదీర్ఘ పోరాటాలు, ఆత్మబలిదానాలతో అవతరించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగులు 40 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేవలం కొన్ని సంవత్సరాల నష్టాలను సాకుగా చూపిస్తూ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. నష్టాల నుంచి గట్టెక్కించి స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాల బాట పట్టడానికి అవసరమైన పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనం వంటి చర్యలను చేపట్టవలసిందిగా విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని, కేంద్రం తలచుకుంటే గనుల కేటాయింపు అసాధ్యం కాదన్నారు. 14 శాతం వడ్డీతో స్టీల్ ప్లాంట్ తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీ రేటుకు మార్పిడి చేయాలని, వడ్డీ చెల్లింపులపై రెండేళ్ళపాటు మారటోరియం ప్రకటించడానికి అనుమతించాలని కోరారు. రుణాలను ఈక్విటీ కింద మార్పిడి చేయాలని ఆయన ఆర్థిక మంత్రిని కోరారు.
ఆదాయ పన్ను చట్టం సవరణతో 32 ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దురదృష్టరమని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. భారీ సంస్థలుగా ఇవి ఆవిర్భవించడానికి అనేక దశాబ్దాలు పట్టింది. కానీ ఒక్క రోజులో వీటి అమ్మకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు.
15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర నిధుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని విజయసాయి రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడం విచారకరమన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులపై ఆధారపడకుండా ఆంధ్రప్రదేశ్ స్వయంసమృద్ధిని సాధించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన ఈ హామీని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చాలని విజయసాయి రెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications