అశోక్ గజపతి రాజుపై సుమోటో కేసు: ఎఫ్ఐఆర్ కోసం: వాసిరెడ్డి పద్మకు సంచైత డిమాండ్
విజయనగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు వ్యవహారంపై విమర్శలు చెలరేగుతోన్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలకు ఉన్న గౌరవ, మర్యాదలివేనా అనే ప్రశ్నలను సంధిస్తోన్నారు రాజకీయ ప్రత్యర్థులు. మున్సిపల్ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ వ్యవహారం.. అటు టీడీపీని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టినట్టయింది.
అశోక్ గజపతి రాజుపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ మన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచైత గజపతి రాజు డిమాండ్ చేశారు. ఛానళ్లలో ప్రసారమైన వీడియో క్లిప్పింగులు, పత్రికల్లో ప్రచురితమైక కథనాలను దీనికి సాక్ష్యంగా తీసుకోవాలని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే.. సొంత పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా ఓ మహిళపై అశోక్ గజపతి రాజు చేయి చేసుకోవడం ఆయన మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించారు.

ఆడవాళ్ల పట్ల టీడీపీ నేతల వైఖరికి ఆయన చర్య ప్రస్ఫూటింపజేస్తోందని అన్నారు. బహిరంగంగా మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. అలాంటి వారిని వదిలేయకూడదని అన్నారు. దౌర్జన్యాలకు పాల్పడే వారిని చూస్తూ వదిలేస్తే..గృహహింసకు గురయ్యే వారిని, సమాజంలో వేధింపులకు గురవుతున్న మహిళలకు తప్పుడు సంకేతాలను ఇచ్చినట్టవుతుందని సంచైత గజపతి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తమను ఆదుకుంటాయనే వారి ఆశలపై నీల్లు చల్లినట్లవుతుందని చెప్పారు.
సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు.. ఏ మాత్రం విచక్షణ లేకుండా, పశ్చాత్తప పడకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే మహిళలపై దౌర్జన్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. మహిళలకు జరిగిన పరాభవం కింద ఐపీసీ 354, 323, 294, 509 లాంటి సెక్షన్ల కింద కేసు పెట్టాలని సంచైత డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ గానీ, ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గానీ తక్షణమే స్పందించాలని సంచైత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications