రాష్ట్రమంతా దళితబంధు.. మూడేళ్లలో అమలు: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు గురించే చర్చ. హుజురాబాద్, వాసాలమర్రిలో కేటాయించడంతో.. మిగతా చోట్ల తమకు కావాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీంతో నేతలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రమంతా దళితబంధు అమలు చేస్తామని చెబుతున్నారు. ప్రతీ దళిత కుటుంబానికి పథకం అమలయ్యేలా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ లేక కొన్ని పథకాలు అమలు కాలేదని మంత్రి వివరించారు. వచ్చే రోజుల్లో ప్రకటించిన పథకాన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని దయాకర్‌రావు తప్పుబట్టారు. వారు చేసే విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు.

ఇక్కడినుంచే ప్రారంభం..
తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన 'సింహ గర్జన' సభ ఇక్కడే నిర్వహించారు. 'రైతు బీమా' పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన 'రైతుబంధు' పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని, సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. దత్తత గ్రామం వాసాలమర్రికి నిధులను విడుదల చేసి.. లాంఛనంగా ప్రారంభించారు.

రక్షణ నిధి
దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

ప్రొటెక్ట్
దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు.
Recommended Video

నగదు జమ
రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు. ఇటు యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బందు పథకం ప్రారంభించారు. దీనిని సంబంధించి ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు. వాసాలమర్రి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ నిధులను విడుదల చేశారు. దళిత బంధు పథకం.. ఆ వర్గాల్లో మనోధైర్యం మరింత పెంచనుంది.












Click it and Unblock the Notifications