సీఎం కేసీఆర్ కు వరుస షాక్ లు: విజయ గర్జన సభకు మళ్ళీ రైతుల సెగ; ఇలా అయితే సభ కష్టమేనా?

టిఆర్ఎస్ పార్టీ పై ప్రజా వ్యతిరేకత మొదలయ్యిందా? హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా చెబుతోందా?వరంగల్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ విజయ గర్జన పేరుతో నిర్వహించ తలపెట్టిన సభకు భూములు ఇవ్వమంటూ ఎదురు తిరుగుతున్న రైతులు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారా? టీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయా?అంటే అవుననే సమాధానమే వస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక షాక్ నుండి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు

హుజురాబాద్ ఉప ఎన్నిక షాక్ నుండి కోలుకోలేకపోతున్న టీఆర్ఎస్ నేతలు


తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీతో ఢీ కొట్టే పార్టీ లేదని,టిఆర్ఎస్ పార్టీ నుండి కుక్కను నిలబెట్టినా గెలిచి తీరుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ నేతలు నిన్న మొన్నటి వరకు చాలా ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా హుజరాబాద్ లో గులాబీ జెండా ఎగరేసి మరోమారు తెలంగాణ రాష్ట్రంలో తమకున్న పట్టును చూపించుకోవాలి అని భావించారు.అయితే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సంచలన తీర్పు ఇచ్చి ఈటల రాజేందర్ ను గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి మంత్రాలు తమ వద్ద పని చేయవని తేల్చి చెప్పారు. ఇక ఈ షాక్ నుండి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు.

టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభకు ఆది నుండీ అవాంతరాలే

టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభకు ఆది నుండీ అవాంతరాలే

ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో నిర్వహించతలపెట్టిన విజయ గర్జన సభ పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమితో సభ నిర్వహించాలా వద్దా అన్న మీమాంస ఒకటైతే, సభ నిర్వహించకుంటే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతామన్న ఆందోళన మరొకటి. ఏదిఏమైనా ఫైనల్ గా సభ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలను టెన్షన్ పెడుతుంది. 29వ తేదీన టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభకు ఆది నుండే అవాంతరాలు ఎదురవుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఈ సభను మొదట ఈ నెల 15వ తేదీన నిర్వహించాలని భావించినా ఈనెల 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించడానికి తేదీని మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల పండుగ సందర్భంగా వరంగల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయ గర్జన సభను నిర్వహించాలని భావిస్తున్న టిఆర్ఎస్ పార్టీ నేతలకు అడుగడుగునా రైతులు షాక్ ఇస్తున్నారు.

పొలాలు ఇవ్వం అంటూ అధికారులు, టీఆర్ఎస్ నేతలపై మరోమారు రైతుల ఆగ్రహం

పొలాలు ఇవ్వం అంటూ అధికారులు, టీఆర్ఎస్ నేతలపై మరోమారు రైతుల ఆగ్రహం

హనుమకొండ జిల్లా దేవన్నపేటలో నవంబర్ 29వ తేదీన సభ నిర్వహించడానికి స్థలాన్ని సేకరిస్తున్న క్రమంలో మరోమారు రైతులు ఆందోళనకు దిగారు. టిఆర్ఎస్ పార్టీ నేతలతో గొడవ పెట్టుకున్నారు. సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించడానికి అధికారులతో కలిసి వెళ్లిన టి.ఆర్.ఎస్ నాయకులను అడ్డుకున్న రైతులు, తమ అనుమతి లేకుండా తమ స్థల సేకరణ ఎలా చేస్తారంటూ నిలదీశారు. మీ రాజకీయాల కోసం మా పంటలను నాశనం చేసుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని, మళ్లీ తమ పొలాల వైపు చూడొద్దంటూ ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనలతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న దేవన్న పేట రైతులు

సభకు భూమి ఇవ్వాలని అధికారులు టిఆర్ఎస్ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని, పంటల సాగుచేస్తున్న భూములను సభ కోసం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు రైతులు. సభకు భూమి ఇవ్వకపోతే ధరణి పోర్టల్ నుంచి భూముల వివరాలు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ భూమిని వేరే వారి పేరు మీద చేస్తామని కొందరు టిఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ నేతల సభాస్థలి సేకరణను అడ్డుకున్న రైతులు

టీఆర్ఎస్ పార్టీ నేతల సభాస్థలి సేకరణను అడ్డుకున్న రైతులు

టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పది లక్షల మందితో నిర్వహించాలనుకుంటున్న విజయ గర్జన సభకు స్థల సేకరణ ప్రధాన సమస్యగా మారడం పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైంది. అసలు సభ జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుంది. మొన్నటికి మొన్న స్థల పరిశీలన కోసం వెళ్ళిన మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ నేతలను రైతులు అడ్డుకుని బహిరంగ సభ కు భూములు ఇవ్వబోమని ఆందోళన చేశారు. తమ భూములను పార్టీ సభ కోసం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తమ పంటలను నాశనం చేసుకోబోమని వెల్లడించారు.

వరంగల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సభ టెన్షన్

వరంగల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సభ టెన్షన్


టీఆర్ఎస్ నేతలను అడ్డగించిన రైతులను పోలీసులు పక్కకు లాగడంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఇప్పుడు మళ్లీ స్థల సేకరణ కోసం దేవన్నపేట భూములను పరిశీలిస్తున్న క్రమంలో మరోమారు రైతులు ఆందోళన బాట పట్టారు. అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కొంటున్న, స్థానిక ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభను ఎలా నిర్వహిస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ఈ సభ నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కానీ రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో షాక్ తింటున్నారు. వారిని అనునయించే ప్రయత్నం చేస్తున్నా లాభం లేకపోవటంతో ఈ సభాస్థలిపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలంగాణా సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+