బావిలో 9 మృతదేహాలు : రెండు వెర్షన్స్.. ఏది నిజం... అసలేం జరిగింది...?
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ బావిలో 9 మృతదేహాలు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు వారి పొరుగునే ఉండే మరో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది సామూహిక ఆత్మహత్యనా.. లేక హత్యనా అన్నది అంతుచిక్కడం లేదు. ఈ ఘటనకు సంబంధించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన బర్త్ డే పార్టీలో వివాదమే హత్యలకు దారితీసి ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. అలాగే విష ప్రయోగమే హత్యకు దారితీసిందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

మక్సూద్ కుటుంబ నేపథ్యం..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎండీ మక్సూద్ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. మొదట్లో కరీమాబాద్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో అతని కుటుంబం నివాసం ఉండేది. గతేడాది డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో అతని కుటుంబం పనిచేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వరంగల్ నుంచి ప్రతీరోజూ గీసుకొండకు వెళ్లడం ఇబ్బందిగా మారింది. దీంతో నెలన్నర క్రితం గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లోకి అతని కుటుంబం అద్దెకు దిగింది. మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు అక్కడే ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరి పక్కనే ఉన్న మరో భవనంలో బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యామ్‌లు ఉంటున్నారు. ఈ ఇద్దరు కూడా గోదాంలోనే పనిచేస్తున్నారు.

తెరపైకి పలు ఊహాగానాలు..
భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుస్రా(22)పై శ్రీరామ్(35),శ్యామ్(40)లు కన్నేయడమే ఈ మొత్తం ఉదంతానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. బుస్రాకు కొంతకాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోందని.. దీంతో ఆమెకు,ఆమె తల్లికి మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో శ్రీరామ్,శ్యామ్‌లు బుస్రాకు వ్యతిరేకంగా ఆమె తల్లికి మద్దతు తెలిపినట్టు సమాచారం. అదే క్రమంలో ఆ ఇద్దరూ ఆమెపై కన్నేయడంతో.. ఆ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

ఒక వెర్షన్ ఇదీ..
మూడు రోజుల క్రితం మక్సూద్ ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ పార్టీకి బుస్రా ప్రియుడు కూడా వచ్చాడని.. ఆ సందర్భంగా శ్రీరామ్,శ్యామ్‌లతో గొడవకు దిగాడని తెలుస్తోంది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసి.. మక్సూద్ కుటుంబాన్ని ఆ యువకులు హత్య చేసి బావిలో పడేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత భయంతో వారు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video

మరో వెర్షన్ ఇదీ..
మక్సూద్ ఇంట్లో జరిగిన విందులో విష ప్రయోగం జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బావిలో లభ్యమైన మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో విష ప్రయోగమే కారణమా అన్న అనుమానాలు తెర పైకి వచ్చాయి. ఒకవేళ విష ప్రయోగమే జరిగితే... వీరందరినీ చంపాల్సిన అవసరం ఎవరికి ఉందన్నది అంతుచిక్కడం లేదు. పోలీసులు ప్రస్తుతం మక్సూద్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. అతని ఇంట్లో జరిగిన విందు చుట్టే ఈ వ్యవహారం ముడిపడి ఉండటంతో.. అసలు విందు జరిగిందా.. లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి యాకూబ్‌పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు












Click it and Unblock the Notifications