ఊపందుకున్న వరంగల్ నియో మెట్రో ప్రాజెక్ట్ .. భూ, ఆకాశ మార్గాలలో .. డీపీఆర్ ఇచ్చిన మహా మెట్రో
హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన తెలంగాణా సర్కార్ అందులో భాగంగా వరంగల్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అందుబాటులోకి రానున్న వరంగల్ మెట్రో రైలు ఆకాశ మరియు భూ మార్గాలలో నిర్మించనున్నారు. వరంగల్ ట్రై సిటీస్ లో మెట్రో ప్రాజెక్టు 15 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నట్టు తెలుస్తుంది .

వరంగల్ నియో మెట్రో కి మహా మెట్రో డీపీఆర్ రూపకల్పన
ట్రై సిటీస్ వరంగల్ లో వరంగల్ నియో మెట్రో ప్రాజెక్టు ఊపందుకుంది. దీనికి సంబంధించిన డి పి ఆర్ ను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధం చేసింది. అయితే వరంగల్ లోనూ హైదరాబాద్ తరహాలో మెట్రో ప్రాజెక్టు రూపొందించాలని తొలుత నిర్ణయించినప్పటికీ దానిలో కొన్ని మార్పులు చేసిన మహా మెట్రో సంస్థ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేసింది. ఈ కొత్త విధానంతో నిర్మాణ వ్యయంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని మహా మెట్రో సంస్థ పేర్కొంది.

ఏడు కిలోమీటర్లు భూ మార్గంలో.. 8 కిలోమీటర్లు ఆకాశమార్గంలో
దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని సంస్థ వెల్లడించింది. ఈ మెట్రో రైలు ఏడు కిలోమీటర్ల మేర భూమార్గంలోను, మరో ఎనిమిది కిలోమీటర్ల మేర ఆకాశమార్గంలోనూ నడుస్తుంది. తాజా డి పి ఆర్ ను కాకతీయ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని, త్వరలో దీనిని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు అని మహా మెట్రో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేష్ దీక్షిత్ వెల్లడించారు. నియో మెట్రో వరంగల్ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా.

నియో మెట్రో విధానంతో భారీగా తగ్గనున్న ఖర్చు
సాధారణ విధానంలో అయితే కిలోమీటర్ కు నిర్మాణానికి 180 కోట్ల రూపాయలు వ్యయం అవుతుండగా తాజా డీపీఆర్ ప్రకారం కిలోమీటర్ కు 60 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని మహా మెట్రో సంస్థ వెల్లడిస్తోంది. ఇదే సమయంలో ఈ కొత్త నియో మెట్రో విధానానికి వరంగల్ రోడ్లు సరిపోతాయని కూడా మెట్రో సంస్థ పేర్కొంది. నియో మెట్రో సాంకేతికతలో ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తారని , రబ్బరు టైర్లపై నడవడం దీని ప్రత్యేకత అని మహా మెట్రో వెల్లడించింది.

నిర్వహణా ఖర్చు కూడా తక్కువే .. 2041 నాటి జనాభాకు తగ్గట్టుగా ప్లాన్
ఆటోమేటిక్ టికెటింగ్ విధానంతో నిర్వహణ ఖర్చు కూడా బాగా తగ్గుతుందని పేర్కొంది. సాధారణ విధానంలో మెట్రో నిర్వహణకు కిలోమీటర్ కు 35 మంది అవసరమైతే, కొత్త విధానంలో 15మంది సరిపోతారని వెల్లడించింది. 2041 నాటికి వరంగల్ జనాభాకు తగ్గట్టుగా ఉండేలా ఈ నియో మెట్రో ప్రాజెక్ట్ ప్రణాళికను రూపొందించారు. ఏదిఏమైనా అభివృద్ధిలో వరంగల్ నగరాన్ని పరుగులు పెట్టిస్తాం అని చెప్పిన కేసీఆర్, వరంగల్ నగరానికి నియో మెట్రో ప్రాజెక్టు అతి త్వరలో తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications