ఆ నేతలతో ప్రాణ హాని ఉంది - వైఎస్ షర్మిల సంచలనం..!!
YS Sharmila: కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన షర్మిల సంచలన ఆరోపణలు చేసారు. షర్మిల పాదయాత్ర పైన వరంగల్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. దీంతో ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర వాయిదా పడింది. పోలీసులు జారీ చేసిన నోటీసుల పైన షర్మిల పార్టీ నేతలు న్యాయనిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇదే సమయంలో షర్మిల అధికార టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేసారు. టీఆర్ఎస్ గూండాల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ఆరోపించారు.
షర్మిల పాదయాత్రలో వరంగల్ లో చోటు చేసుకున్న పరిణామాలు..తదనంతర రాజకీయాలతో ఒక్క సారిగా షర్మిల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇదే సమయంలో షర్మిల వ్యాఖ్యలు - టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో నిలిచిన తన పాదయాత్రను ఈ రోజు నుంచి ప్రారంభించాలని షర్మిల భావించారు. కానీ, అనూహ్యంగా పోలీసుల నుంచి పాదయాత్రకు సంబంధించి నోటీసులు వచ్చాయి. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. కోర్టు ఆదేశాలకు ఎవరైనా లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. ఈ క్రమంలో నేడు ప్రారంభం కావాల్సిన పాదయాత్రను షర్మిల వాయిదా వేసుకున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతల పైన విమర్శలు గుప్పించారు.

ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు నిజంగా అవినీతి చేయకపోతే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సూచించారు. పోలీసుల భుజం పైన తుపాకి పెట్టి తన పాద యాత్రను టార్గెట్ చేసారని విమర్శించారు. తాను ఎవరి పైనా వ్యక్తిగత విమర్శలు చేయటం లేదన్నారు. టీఆర్ఎస్ నేతలే మహిళ అని కూడా లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన పాదయాత్ర కొనసాగుతుందని దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం తిరిగి తన పాదయాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్న షర్మిల..న్యాయ నిపుణుల సలహాల మేరకు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications