పవన్, లోకేష్ మధ్య గొడవలతో జరుగుతోంది ఇదే- భూమన షాకింగ్..!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చాలా కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య వైరుధ్యాలతో జరుగుతున్న నష్టం ఏంటో ఆయన వివరించారు. ఎవరో చేసిన తప్పులకు మరెవరో క్షమాపణ కోరడాన్ని కూడా భూమన ప్రస్తావించారు. దీంతో భూమన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్‌లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు.

సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదని భూమన ఆరోపించారు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోందని గుర్తుచేశారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయిందన్నారు. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఈ రోజు కాశీనాయన క్షేత్రంను పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని భూమన ప్రశ్నించారు. మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందకు క్షమాపణలు చెప్పారని నిలదీశారు. తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా అని భూమన ప్రశ్నించారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడంను ఎలా అర్థం చేసుకోవాలని అడిగారు.
నారా లోకేష్, పవన్ కల్యాణ్ ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా? అని భూమన ప్రశ్నించారు. సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే అన్నారు. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారన్నారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారని, ఇది సమర్థించుకోవడం కాదా అని అడిగారు.












Click it and Unblock the Notifications