వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పోరాడాలని అమెరికాలోని నల్గొండ జిల్లా ఎన్నారైలు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి ఏ మాత్రం తక్కువ కాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పలువురు నల్గొండ ప్రవాస ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇండియానా నుంచి ఆటా సంస్థ మాజీ అధ్యక్షులు చంద్రారెడ్డి గవ్వ, జార్జియా నుంచి రిపబ్లికన్ పార్టీ అట్లాంటా కో-ఆర్డినేటర్ నరేందర్ గంట్ల, న్యూజెర్సీ నుంచి ఆట సంస్థ రీజనల్ కో-ఆర్డినేటర్ మహేంద్ర ముసుకు, న్యూజెర్సీ నుంచి వాసు విశ్వనాథుల, అశోక్‌రెడ్డి నారాయణ, టెక్సాస్ నుంచి రఘు జడల తదితర నల్గొండ జిల్లా ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొని ఉద్యమపథంపై చర్చించారు.
ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా నిర్ణయం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రులు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి అఖిలపక్ష జెఎసి ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేసారు. తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందర్నీ అభినందించారు. సాధారణంగా అధికారం కోసం ఎవరితీరు వారిదే అన్నట్లు ఉండే నేతలు తెలంగాణ ఉద్యమంలో ఒక్కతాటిపై నడవడం పట్ల ఎన్నారైలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. అదేవిధంగా రాజకీయ నేతలు, విద్యార్దులు, ఇతర ఉద్యమకారులు సంఘటితమై ఆంధ్ర ప్రాంత నేతల ధన ప్రాభల్య రాజకీయాలను అడ్డుకోవాలని వారు సూచించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు సమైక్యంగా ఉద్యమంలో ముందుకు సాగుతూ న్యాయమైన తెలంగాణ సాధనకోసం శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఎన్నారై ప్రముఖులు ఆకాంక్ష వ్యక్తం చేసారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి