వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రకారుడు చంద్రకు టాంటెక్స్ సత్కారం

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక నిర్వహిస్తున్న 'నెల నెలా తెలుగు వెన్నెల' 30వ సదస్సు జనవరి 17 ఆదివారం నాడు డల్లాస్ లో స్థానిక ప్యారడైస్ బిర్యాని పాయింట్ భోజనశాలలో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి అధ్యక్షతన జరిగింది. తెలుగు భాషాభిమానులు, సాహితీప్రియులు డల్లాస్ ప్రాంతం నుండే కాకుండా దాదాపు 200 మైళ్ళ దూరం నుంచి కూడా ప్రయాణించి వచ్చారు.

మాసానికో మహనీయుడు ('మామ') అనే కొత్త శీర్షికలో భాగంగా విజయ చంద్రహాస్ మద్దుకూరి రచయిత, న్యాయవాది, సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి రచనా జీవితంలోని కొన్ని ఘట్టాలను ఆహూతులకు తెలియజేశారు. అనేక స్థానిక సాహితీ ప్రియులు 'స్వీయరచనల' శీర్షికలో భాగంగా తమ కవితలను, కథలను వినిపించారు. అనంతరం డాక్టర్ ఊరిమిండి గేయ రచయితల మీద ఆకస్మిక పరీక్ష ఏర్పాటు చేశారు. ప్రముఖ చిత్ర గేయ రచయితలైన ఆరుద్ర, వేటూరి, ఆత్రేయ, సినారె, దాశరథి, శ్రీశ్రీ, సముద్రాల, సిరివెన్నెల రాసిన అనేక ప్రముఖ చిత్ర గేయాలకు సంబంధించిన ప్రశ్నోత్తరాలు అందరికీ విజ్ఞాన వినోదాలను అందించాయి. ఆరేళ్ళ చిన్నారి పూజిత స్వచ్ఛమైన తెలుగు భాషలో దేశభక్తి గేయం పాడి అందరి మనసులను దోచుకుంది.

తేనీటి విరామానంతరం ముఖ్యఅతిథి కళారత్న, ప్రజా చిత్రకారుడు మైదం చంద్రను డాక్టర్ ఊరిమిండి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. శ్రీమతి పూర్ణా నెహ్రూ ముఖ్యఅతిథిని పుష్పగుచ్ఛంతో సాంప్రదాయబద్ధంగా గౌరవించారు. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిని సభకు పరిచయం టేస్తూ, మైదం చంద్ర 'చూపుల ద్వారా స్వాహా చేసి దృశ్యాలను వేళ్ళ చివర్ల కుంచెల ద్వారా ప్రపంచాల అంచుల వరకూ విసిరేసిన ప్రముఖుల్లో ఒకరు' అన్నారు. చంద్ర వేసిన బొమ్మలు పాత్రలనే కాక ఆ పాత్రల లోతుల్లోని మానసిక ఆనందాల్ని, అంతరంగాల అల్లకల్లోలాల్ని, సంఘర్షణల్నీ చెబుతాయని ప్రముఖుల విశ్వాసం. చంద్ర చిత్ర కళా ఔనత్యాన్ని మహాకవి శ్రీశ్రీ తమ ప్రసంగాలలో కూడా ప్రశంసించారు.

సభను ఉద్దేశించి చంద్ర మాట్లాడుతూ, తన బాల్యం, అతి నిరాడంబరంగా మొదలై, చిత్ర కళారంగ పరిచయం నుంచి బాపు బొమ్మలతో సమానంగా రాణించగలగడం తమ అదృష్టం అన్నారు. అనేక వార, మాస పత్రికలకు సంపాదకీయునిగా పనిచేయడమే కాకుండా చంద్ర దాదాపు 150 కి పైగా కథలు రాసి, చిత్ర పరిశ్రమలో నటుడిగా, చిత్రకారుడిగా పేరుపొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

ముఖ్యఅతిథి సన్మాన కార్యక్రమంలో భాగంగా టాంటెక్స్ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి శాలువతో చంద్రను సత్కరించారు. సాహిత్య వేదిక కమిటీ సభ్యులు రావు కల్వల, విజయ్ చంద్రహాస్ మద్దుకూరి, సురేష్ కాజ, డాక్టర్ ఊరిమిండి సంయుక్తంగా ముఖ్యఅతిథికి జ్ఞాపికను బహూకరించారు. చివరగా సాహిత్య వేదిక కమిటీ సభ్యులు హాజరైన సాహితీ ప్రియులకు, ముఖ్యఅతిథికి, ప్యారడైస్ బిర్యాని పాయింట్ భోజనశాల యాజమాన్యానికి కృతజ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X