వికలాంగుల డాక్టర్ గుడారుకు కు డల్లాస్ లో సన్మానం

ముఖ్యఅతిథి డాక్టర్ గుడారును డాక్టర్ కొర్సపాటి వేదిక మీదకు ఆహ్వానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం రేపటి అధ్యక్షుడు చంద్రకన్నెగంటి, ఉపాధ్యక్షుడు ఎన్.ఎమ్.ఎస్. రెడ్డి కలిసి శాలువతో డాక్టర్ గుడారును సత్కరించారు. తానా రేపటి అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, కోశాధికారి రామ్ యలమంచిలి కలిసి డాక్టర్ గుడారుకు జ్ఞాపికను బహూకరించారు. విజయమోహన్ కాకర్ల పుష్పగుచ్ఛంతో సంప్రదాయబద్దంగా డాక్టర్ గుడారును గౌరవించారు.ముఖ్యఅతిథి పరిచయ కార్యక్రమం కాకర్లతో ప్రారంభమైంది. డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి మాట్లాడుతూ 'డాక్టర్ గుడారు రాజంపేటలో జన్మించిన ఒక ఆణిముత్యం అన్నారు. ఎన్నో వేల మంది వికలాంగుల బతుకుల్లో వెలుగులు నింపిన సూర్యుడు గుడారు' అని కొనియాడారు. 'అతి నిరాడంబరంగా జీవనం మొదలై, దేశ విదేశాలలో వృత్తి పరంగా ఎన్నో ప్రశంసలు అందుకొన్న తిరుగులేని వైద్యుడన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఎన్నో వేల మంది వికలాంగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించి వారికి పునర్జన్మ ప్రసాదించిన ఘనత డాక్టర్ గుడారు సొంతం చేసుకొన్నార'ని డాక్టర్ ఊరిమిండి ప్రశంసించారు.
అతిథి సత్కారం అనంతరం డాక్టర్ గుడారు మాట్లాడుతూ, తాము చేస్తున్న శస్త్ర చికిత్సల వివరాలు, శిబిరంలో గత పదిహేనేళ్ళుగా చోటుచేసుకొన్న పరిణామాలు, ఇతర జాతీయ సేవా కార్యక్రమాల గురించి సభకు వివరించారు. డాక్టర్ గుడారు వికలాంగుల శస్త్ర చికిత్సలో అవలంబించిన పద్ధతుల చిత్రీకరణ దృశ్యాలు సభను ఎంతో ఆకట్టుకొన్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో డాక్టర్ గుడారు మాట్లాడుతూ, గ్రామాలలో వికలాంగులెవరైనా ఉంటే వారిని తిరుపతిలోని తమ శిబిరానికి పంపించాలని కోరారు.
చివరిగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉపరాయస సురేష్ మండువ డాక్టర్ గుడారుకు, హాజరైన తెలుగు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కోకిల ఇండియన్ భోజనశాల యాజమాన్యం రుచికరమైన విందు భోజనం వడ్డించినందుకు, పండుగ వాతావరణం కల్పించినందుకు కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలిపారు.