సంక్షోభం వేళ భారత్ కు మరో JACKPOT.. భారీగా బయటపడ్డ గ్యాస్ నిల్వలు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పటికే భారత్ లో వారం రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలను మూడు సార్లు పెంచాయి చమురు సంస్థలు. అలాగే గ్యాస్ బుకింగ్, డెలివరీ విధానంలోనూ పలు మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత్ కు జాక్ పాట్ తగిలింది. రాజస్థాన్ జైసల్మేర్ బేసిన్ లోని దండేవాలా క్షేత్రంలో సహజ వాయువు నిల్వలు భారీగా బయటపడ్డాయి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాల్లో భారీగా చమురు నిల్వలు బయటపడినట్లు తేలింది. దాంతో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇదే విషయంపై అభినందనలు తెలిపారు.
దండేవాలా క్షేత్రంలో తక్కువ లోతులో ఉండే సాను ఫార్మేషన్ అనే పొరలో తొలిసారిగా సహజవాయువు నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమికి దాదాపు 950 మీటర్ల లోతులోనే ఈ నిల్వలు దొరకడం విశేషం. ప్రస్తుతం ఇక్కడి నుంచి రోజుకు సగటున 25,000 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు ప్రవహిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కొత్త జోన్ లో దాదాపు 75 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అయితే సాధారణంగా గ్యాస్ కోసం చాలా లోతుగా రంధ్రాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇది కేవలం 950 మీటర్ల లోతులోనే దొరకడం వల్ల డ్రిల్లింగ్ ఖర్చులు చాలావరకు తగ్గుతాయని అలాగే త్వరలోనే వాణిజ్య పరమైన ఉత్పత్తిని ప్రారంభించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఇక్కడ దొరికినది సహజవాయువు.. ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. దీనిని ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఉపయోగిస్తారు. అయితే మనం సిలిండర్లలో వాడే ఎల్పీజీ లో ప్రొపేన్, బ్యూటేన్ వంటి వాయువులు ఉంటాయి. ఇవి ముడి చమురు శుద్ధి ప్రక్రియలో ఎక్కువగా లభిస్తాయి. ఇక భారత్ లో వంటగ్యాస్ వినియోగం చాలా ఎక్కువ అన్న విషయం తెలిసిందే. మన దేశ అవసరాల కోసం దాదాపు 50 శాతంకు పైగా ఎల్పీజీని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. దండేవాలాలో లభించిన నిల్వలు ప్రాంతీయ అవసరాలకు, స్థానిక పరిశ్రమలకు బాగా సరిపోతాయి.. కానీ దేశవ్యాప్త ఎల్పీజీ కొరతను తీర్చేంత స్థాయిలో నిల్వలు లేవు..












Click it and Unblock the Notifications