ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో 2011 సంవత్సరంలో భారత విద్యార్థుల ప్రవేశాలు 80 శాతం మేర తగ్గుతాయని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం ఉపకులపతి గ్లిన్ డేవిస్ చెప్పారు. భారత విద్యార్థులపై జాతి వివక్ష దాడులు పెరగడమే ఇందుకు కారణమని వివరించారు. ఎగుమతుల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే విక్టోరియా రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా ఉన్నతవిద్య రంగంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. ''మాకు అందిన సమాచారం ప్రకారం.. భారత్ నుంచి దరఖాస్తులు 80 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. 90 శాతం మేర కూడా తగ్గినట్లు కొన్ని విద్యాసంస్థలు చెబుతున్నాయి'' అని ఆయన తెలిపారు.
గత ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకూ భారతీయులపై దాడి జరిగిన ఘటనలు వంద వరకూ నమోదయ్యాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ కు ఎన్ని హామీలు ఇచ్చినా, దాడులపై ఎన్ని చర్యలు తీసుకున్నామని చెప్పినా దాడులు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో అక్కడ దాడులు జరగడం పరిపాటిగా మారింది. దీంతో తమ పిల్లలను ఆస్ట్రేలియాకు పంపడానికి భారతదేశంలోని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒకప్పుడు అత్యంత ప్రశాంతమైన దేశంగా ఉన్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా దాడులకు కేంద్రంగా మారిపోవడాన్ని భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.