వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు కవి సమ్మేళనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Poets gathering in USA during Ugadi
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 69 వ సదస్సు ఆదివారం, ఏప్రిల్ 21 వ తేది స్థానిక డీ.ఎఫ్.డబ్ల్యూ. హిందూ దేవాలయ ప్రాంగణంలో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 69 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డల్లాస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి విచ్చేసారు.

స్థానిక చిన్నారులు జంగేటి మహిత, చామకూర కీర్తి, ధర్మపురం నేహ, వస్కర్ల శ్రియ ఆధ్యాత్మిక ప్రార్థన మరియు ఒక దేశభక్తి గీతంతో సభ ప్రారంభమైంది. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి మన ఆస్థాన అవధాని ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ అధ్యక్షత వహించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో షడ్రసోపేతమైన కవితా విందును ఆస్వాదించమని సాహితీ ప్రియులందరికీ ఒక వినూత్న మైన కవితతో ఆరంభించారు.

ప్రతి నెలాజరపు కొనే నెల నెలా తెలుగు వెన్నెలకు సభికులకు సుస్వాగతం తెలుపుతూ తన కవితను వారికే అంకితం చేసారు.సాహిత్యవేదిక మొదటి భాగం నవరసభరితమయిన కవితాపఠనంతో అత్యంత ఆసక్తికరంగా జరిగింది. కొద్ది రోజులముందే జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ్ రచనా జీవితంలోని ప్రధాన ఘట్టాలనుఆయులూరి బస్వి సభతో పంచుకున్నారు. పాలూరి సుజన తమ "నవరస నారి" కవితలో నవరసాలొలికించే స్త్రీ మూర్తులను ఉటంకిస్తూ చక్కని కవిత చదివి అందరినీ ఆకట్టుకున్నారు. నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి విజయ నామ సంవత్సర ఉగాది పై చక్కని కవితను చదివి అందరినీ అలరించారు. కన్నెగంటి చంద్ర "నిర్ణిమిత్తం" కవితని చదివి వినిపించారు.

విజయ మద్దుకూరి చంద్రహాస్ ఇటీవల అమరులైన ప్రముఖ గాయకుడు శ్రీ పీ.బీ శ్రీనివాస్ పాడిన మధుర గీతాలను గుర్తు చేసుకున్నారు. ఆ అమర గాయకుడి ఆత్మకు శాంతి కలగాలని ఆశించారు. డా.జువ్వాడి రమణ నన్నయ, తిక్కన, పోతన పద్యాలు చక్కగా పాడి అందరి మన్ననలు పొందారు. టాంటెక్స్ ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మన సంస్థ దీర్ఘకాలపు సభ్యులు, కీర్తిశేషులు ఆకుండి సుమతి కలం నుండి జాలువారిన కవితా సంకలనం లోని "బంగారు తల్లి", "సెలయేరు", "ఆధునిక ఆంధ్ర చరిత్ర" కవితలు వినిపించి ఆ ఆత్మీయ మాతృమూర్తికి ఘన నివాళి అర్పించారు.

విరామంలో స్థానిక పసంద్ రెస్టారెంట్ వారందించిన వేడి, వేడి అల్పాహారం (పునుగు), తేనీరు అందరూ స్వీకరించారు. ప్రముఖ రంగస్థల నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ గారి స్వీయ సీసపద్యాలు, తేటగీతులని శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు చదివి వినిపించారు. "మాసానికో మహనీయుడు" శీర్షిక సందర్భంగా ఏప్రిల్లో పుట్టినటువంటి తెలుగు ప్రముఖులు నండూరి రామమోహన రావు, కందుకూరి వీరేశలింగం పంతులు, కొండవీటి వెంకటకవి, గొల్లపూడి మారుతీరావుని కే.సీ.చేకూరి సభకి గుర్తు చేసారు. తానాలో నిర్వహించబోయే "గీతానాంజలి" గేయ రచనల పోటీ గురించి తానా సాహిత్య వేదిక సమన్వయకర్త మద్దుకూరి విజయ చంద్రహాస్ గారు సభకు తెలియజేసారు.

టాంటెక్స్ కార్యవర్గ సభ్యుడు శ్రీ మల్లవరపు అనంత్ ప్రస్తుత డాలసులోని ప్రకృతిని గుర్తు చేస్తూ తన స్వీయ కవిత "వసంతంలో హేమంతం " చదివి వినిపించారు. అలాగే నాట్స్ వారు నిర్వహిస్తున్న కథ, ఫోటో కవిత, కవితల పోటీల గురించి శ్రీ మల్లవరపు అనంత్ వివరాలను అందించారు. కాజా సురేశ్ బాపట్లకు చెందిన చిత్రకారుడి ఉత్తమ ఫోటోకి స్పందిస్తూ ఒక కవితను చదివారు. పల్లె పడుచు పెళ్ళి చూపుల సందడిని గుర్తు చేస్తూ శ్రీ అట్ల రంగారెడ్డి సభలో ఉన్న అందరినీ పల్లెటూరు విహారం చేయించారు.శ్రీశ్రీ మహాప్రస్థానం నుండి "రాక్షస ఉగాది" కవితను షేక్ నసీం చదివారు.

టాంటెక్స్ అధ్యక్షుడు మండువ సురేష్ మాట్లాడుతూ "ఉగాది ఉత్సవాల ప్రధాన వేదికపై నిర్వహించాలనుకొన్న కవిసమ్మేళనం 69వ సదస్సులో అత్యంత ఆసక్తికరంగా జరగడం తమకు ఆనందంగా ఉంది" అన్నారు. టాంటెక్స్ కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు చామకూర బాల్కి, శ్రీ వీర్ణపు చినసత్యం, పాలక మండలి అధిపతి డా. సి.ఆర్.రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సభను ముగించే ముందు ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ తమ అవధానం అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ జ్ఞాపకాల నుండి కొన్ని పద్యాలను కమ్మగా పాడారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉగాది కవి సమ్మేళనం పూర్తి స్తాయిలో చక్కగా జరిగినందుకు సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి , వెన్నుదన్నుగా నిలిచి జయప్రదం చేసినందుకు ఆచార్య పూదూర్ జగదీశ్వరన్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన డీ.ఎఫ్.డబ్ల్యూ హిందూ దేవాలయ యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, టీవీ5, టీవీ9, రేడియో తరంగిణి, రేడియో గానసుధ వారికి మరియు పసంద్ రెస్టారెంటు యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

English summary

 Telugu poets gathering has been held at Dallas in USA during Ugadi festival by TANTEX, which organising Nela Nela Vennela, a Telugu literrary programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X